అధ్యక్షా...అయ్యన్నకే చాన్స్ !?
ఇక మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణం తరువాత స్పీకర్ ఎన్నికను చేపడతారు.
By: Tupaki Desk | 16 Jun 2024 1:22 PM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు బహుశా ఈ వారంలో జరగవచ్చు. దీనికి సంబంధించి మంత్రివర్గం ఈ నెల 18న సమావేశం అయి నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలలో ప్రొటెం స్పీకర్ ఎన్నికతో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణం తరువాత స్పీకర్ ఎన్నికను చేపడతారు.
టీడీపీ నుంచి సెపీకర్ గా ఎవరు ఉంటారు అన్నది అయితే ఒక పెద్ద చర్చగా ఉంది. అయితే స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నేతకే దక్కుతుంది అని అంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉన్న కిమిడి కళా వెంకటరావు అలాగే చింతకాయల అయ్యన్నపాత్రుడులలొ ఒకరికి ఈ పదవి దక్కుతుంది అని అంటున్నారు.
కళా కంటే అయ్యన్న వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన అయ్యన్నకు మంత్రి పదవి ప్రతీ సారీ దక్కుతూ వచ్చేది. అలా ఆయన ఆరు సార్లు మంత్రిగా కీలకమైన శాఖలు చూశారు.
కానీ ఈసారే టీడీపీ గెలిచినా అయ్యన్నకు మంత్రి పదవి లభించలేదు. దాని మీద అయ్యన్న మాట్లాడుతూ తనకు మంత్రి పదవి దక్కకపోయినా బాధ ఏమీ లేదని అన్నారు. జూనియర్లను తాము ప్రోత్సహిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అయ్యన్నకు టీడీపీ హై కమాండ్ నుంచి మంచి హామీ ఉండబట్టే ఆయన ఈ విధంగా మాట్లాడారు అని కూడా అనుకున్నారు.
మరో వైపు చూస్తే అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఇది దాదాపుగా ఆమోదించిన నిర్ణయమే అని అంటున్నారు. అయ్యన్న అయితే సభను పూర్తిగా కంట్రోల్ లో పెడతారని అలాగే విపక్షం నుంచి వైసీపీ హాజరైనా ఆయన సభను సజావుగా నడిపించేందుకు సరైన చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా నుంచి ఇప్పటికి చాలా మంది స్పీకర్లుగా పనిచేసారు. గతంలో తంగి సత్యనారాయణ, ప్రతిభా భారతి, తాజాగా తమ్మినేని సీతారాం శ్రీకాకుళం నుంచి స్పీకర్లుగా ప్రాతినిధ్యం వహించగా ఇపుడు విశాఖకు ఈ చాన్స్ దక్కుతోంది అని అంటున్నారు. ఏపీ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక స్పీకర్ వంటి రాజ్యాంగ బద్ధమైన పదవి ఏపీకి దక్కలేదు అన్నది వాస్తవం అంటున్నారు.
ఇప్పటిదాకా మంత్రిగా పనిచేసిన అయ్యన్న స్పీకర్ గా కొత్త బాధ్యతలతో ఎలా కుదురుకుంటారు అన్నది చూడాలని అంటున్నారు. మరో వైపు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కూడా చంద్రబాబు న్యాయం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనను చీఫ్ విప్ గా నియమిస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి బాబు మార్క్ వ్యూహంతో ఈసారి అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశాలే చోటు చేసుకుటాయని అంటున్నారు.