Begin typing your search above and press return to search.

లోక్ సభ స్పీకర్ పదవి అంత వీజీ కాదు

అయితే, ఈ ఇద్దరూ స్పీకర్ పదవిపై ఎందుకింత పట్టుపడుతున్నారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 1:02 PM GMT
లోక్ సభ స్పీకర్ పదవి అంత వీజీ కాదు
X

2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షాల మీద ఆధార పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ, జేడీయూలపై ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ లు మోడీ సర్కార్ ను నిలబెట్టడంలో కీలకంగా మారారు. మరీ ముఖ్యంగా 12 మంది ఎంపీలున్న నితీశ్ కుమార్ తో పోలిస్తే 16 మంది టీడీపీ ఎంపీలున్న చంద్రబాబు మోడీకి ఎంతో కీలకంగా మారారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నేతలు లోక్ సభ స్పీకర్ పదవి తమకు కావాలని మోడీని కోరారని జాతీయ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఇద్దరూ స్పీకర్ పదవిపై ఎందుకింత పట్టుపడుతున్నారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

అయితే, సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పదవికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పొరపాటున మిత్రపక్షాలతో తేడాలొస్తే స్పీకర్ చేతిలో చక్రం ఉంటుంది. దాంతోపాటు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసే అధికారం కూడా స్పీకర్ కు ఉంటుంది. అందుకే, తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఇద్దరు సీనియర్ పొలిటిషన్లు ముందు జాగ్రత్తగా స్పీకర్ పదవి కోరుతున్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. కాబట్టి, ఈ లోపే స్పీకర్ పదవి కోసం చంద్రబాబు, నితీశ్ పట్టుబడుతున్నారట.

కానీ, బీజేపీకి పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇచ్చే సమస్యే లేదని బీజేపీ భావిస్తోందట. 2014లో సుమిత్రా మహాజన్‌, 2019లో ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికైనా..బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఇబ్బంది లేదు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని పురందేశ్వరికి ఇస్తామన్న ప్రతిపాదనను మోడీ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం స్పీకర్ పదవి కావాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి స్పీకర్ పదవి పార్టీలకు అతీతంగా ఉండేది. ఆ కుర్చీలో కూర్చునే వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ, గత రెండు దశాబ్దాలుగా స్పీకర్ లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా స్పీకర్ కుర్చీ కోసం పొలిటికల్ మ్యూజికల్ ఛెయిర్స్ ఆట ఆడుతున్న టీడీపీ, బీజేపీ, జేడీయూలలో ఏది గెలుస్తుంది అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.