Begin typing your search above and press return to search.

ఏలూరుపై ఎగిరే జెండా ఎవరిది ?

ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుండడమే దీనికి కారణం.

By:  Tupaki Desk   |   27 May 2024 4:30 PM GMT
ఏలూరుపై ఎగిరే జెండా ఎవరిది ?
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏలూరు శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 1978 ఎన్నికల నుండి అది దానిని నిలబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఈ శాసనసభ స్థానం నుండి గెలుపు ఏ పార్టీది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుండడమే దీనికి కారణం.

1978లో కాంగ్రెస్ అభ్యర్థి సూర్యప్రకాష్ రావు జనతా పార్టీ అభ్యర్థి మీద పది వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించాడు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983లో టీడీపీ తరపున చెన్నకేశవులు రంగారావు కాంగ్రెస్ అభ్యర్థి పులివెంకట సత్యనారాయణ మీద ఏకంగా 47515 ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు 62,657 ఓట్లు వచ్చాయి. తిరుపతిలో ఎన్టీఆర్ తర్వాత ఈయనదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1985లో ఆయన నాదెండ్ల వర్గం వైపు వెళ్లాడు.

ఈ నేపథ్యంలో 1985 ఎన్నికల్లో మారదాని రంగారావు టీడీపీ తరపున నిలబడగా 20 వేల పైచిలుకు ఓట్లతో గెలవడం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. 1989 ఎన్నికల్లో రంగారావు మీద కాంగ్రెస్ అభ్యర్థి నేరెళ్ల రాజా 4 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున మారదాని రంగారావు కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి వరలక్ష్మీ దేవి మీద గెలిచాడు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

1999లో టీడీపీ నుండి అంబికా కృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి కాలి క్రిష్ణ శ్రీనివాస్ మీద విజయం సాదించాడు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలి క్రిష్ణ శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థులు మారదాని రంగారావు, కోట రామారావుల మీద విజయం సాధించడం రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట రామారావు వైసీపీ అభ్యర్థి కాలి క్రిష్ణ శ్రీనివాస్ మీద విజయం సాధించడం టీడీపీ అధికారంలోకి రావడం, 2019 ఎన్నికల్లో కాలీ క్రిష్ణ శ్రీనివాస్ కోట రామారావు మీద విజయం సాధించడం వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో తిరిగి కాలీ క్రిష్ణ శ్రీనివాస్ వైసీపీ తరపున బరిలో నిలవగా, బడేటి రాధాక్రిష్ణ టీడీపీ తరపున బరిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారా ? అన్న ఉత్కంఠ నెలకొంది.