మోడీని ఎందుకు అడగరో... విరాళాలు పోగు చేస్తున్న బాబు!
2014 నుంచి 2019 టెర్మ్ లో చూస్తే కేంద్రంలో బీజీపీతో నాలుగేళ్ల పాటు పొత్తులో బాబు ఉన్నారు.
By: Tupaki Desk | 10 Sep 2024 4:05 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కేంద్రాన్ని ఇబ్బంది పెట్టరు. ఆయన తన తెలివి తేటలను వ్యూహాలను జోడిస్తూ నిధులను పోగు చేస్తారు. 2014 నుంచి 2019 టెర్మ్ లో చూస్తే కేంద్రంలో బీజీపీతో నాలుగేళ్ల పాటు పొత్తులో బాబు ఉన్నారు. ఆనాడే అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టారు.
మోడీ శంకుస్థాపన చేసి వెళ్లారు. అయితే అమరావతి కోసం నిధుల సేకరణ అని ఇటుక నుంచి అన్నీ జనంలో పెట్టింది నాటి ప్రభుత్వం. అంతే కాదు అప్పుల కోసం ప్రపంచమంతా తిరిగింది. ఇక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ సింగపూర్ తో ఒప్పందాలు చేసుకుంది.
అయితే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది. కానీ కేంద్రాన్ని పెద్దగా నాడు డిమాండ్ చేయలేదు అని విపక్షాలు విమర్శలు చేశాయి. కేంద్రం అయితే అమరావతికి రెండు వేల కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది అని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.
మరో వైపు చూస్తే ప్రపంచ రాజధాని లక్ష కోట్ల నిధులు అవసరం అవుతాయని ఎస్టిమేట్లు తయారు చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇతోధికంగా రాజధాని నిధులను సేకరించలేక పోయింది అన్న విమర్శలు ఉన్నాయి. కట్ చేస్తే 2024లో మరోసారి బీజేపీతో పొత్తు కుదిరింది. అక్కడ మోడీ ఇక్కడ బాబు అధికారంలోకి వచ్చారు.
చిత్రమేంటి అంటే ఈసారి బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు పూర్తిగా అవసరం పడింది. అయినా కూడా అమరావతి రాజధానిని పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం లేదు అన్న విమర్శలు వచ్చాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి తాను పూచీగా ఉండి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోంది. మరి ఇది అప్పుగా ఉంటుందా ఉంటే ఎవరు తీర్చాలి అన్నది ఇంకా తేలలేదు.
మరో వైపు చూస్తే భారీ వరదలతో బెజవాడ మునకేసింది. కేంద్రం నుంచి తక్షణ సహాయం కింది రెండు మూడు వేల కోట్లు అయినా వచ్చినట్లు అయితే ఏపీలో సజావుగా పని జరిగేది. కానీ అలా ఏమీ జరగడం లేదు. దాంతో టీడీపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను పడుతోంది. చంద్రబాబు మళ్లీ విరాళాల కోసం జనానికి పిలుపు ఇచ్చారు.
బాబు పిలుపునకు స్పందించి అంతా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఇది మంచిదే కానీ ఏపీని ఆదుకోవాల్సిన కేంద్రం ఎందుకు తక్షణ సాయం చేయడం లేదు అన్న ప్రశ్న ఉండనే ఉంది. అంతే కాదు ఆఖరుకు కిడ్డీ బ్యాంకులో దాచుకున్న చిన్న పిల్లలు కూడా వరద బాధితులకు విరాళం ఇస్తున్నారు.
దీని మీద కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల గట్టిగానే విమర్శించారు. పసి పిల్లల నుంచి డబ్బులు తీసుకోవడమేంటి బాబు గారూ అని ఆమె నిలదీశారు. కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఏపీకి పది వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని తీసుకుని రాలేరా అని ఆమె బాగానే ప్రశ్నించారు. ఆమె అడిగింది చూస్తే నిజమే కదా అనిపిస్తుంది.
కేంద్రం ఏపీ ఎంపీల మద్దతు ఉంది. ఏపీకి అతి పెద్ద కష్టం వచ్చింది. కానీ ఈ రోజుకీ రూపాయి విదల్చలేదు. మరి వరద బాధితులను ఆదుకునేది ఎలా. ఈ విషయంలో కేంద్రం తక్షణ సాయం అయినా చేసినట్లు అయితే ఊరట కలిగేది కానీ అలా జరగలేదే. మరి చంద్రబాబు కేంద్ర బృందాన్ని ఏపీకి వెంటనే పంపించినందుకే ధన్యవాదాలు చెప్పారు.
కేంద్రం సాయం విషయంలో ఆయన డిమాండ్ చేస్తే బాగుంటుంది కదా అన్న చర్చ వస్తోంది. మరి బాబు విరాళాలు ఇవ్వాలని జనాల్లో కోరుతున్నారు. నిజమే ఏపీలో ప్రజలు సాయం చేస్తారు. ఇది ఒక ఎత్తు. కానీ ఎంత విరాళాలు ఇచ్చినా వేల కోట్లు పోగు కావు కదా. మరి కేంద్రాన్ని ఎందుకు బాబు డిమాండ్ చేయరు అన్నదే అందరిలో కలుగుతున్న సందేహం. డిమాండ్ చేసినా మోడి అనుకున్నది ఇవ్వరనా లేక కేంద్రం మీద ఒత్తిడి ఎందుకు అన్న ఆలోచనతోనా. ఏమో బాబు గారికే ఇదంతా తెలియాలి. కానీ ఆయన విరాళాల సేకరణ మాత్రం ఒకింత విమర్శల పాలు అవుతోంది.