ఏపీలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా
రాబోయే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
By: Tupaki Desk | 12 Nov 2024 4:03 PM GMTఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 5న మెయిన్స్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులంతా ఎదురుచూస్తున్నారు. అయితే, చాలామంది అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి విజ్నప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. రాబోయే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
సిలబస్ లో మార్పులు, పూర్తి స్థాయిలో సన్నద్ధత కాకపోవడం వంటి కారణాల నేపథ్యంలో మెయిన్స్ పరీక్ష రాసేందుకు మరికొంత గడువు కావాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో, ఈ విషయంపై సముచిత నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి కొందరు ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రకారం అభ్యర్థులతోపాటు కొందరు ప్రజా ప్రతినిధులు ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధకు వేర్వేరుగా విజ్ఞప్తి పత్రాలిచ్చారు. ఈ క్రమంలోనే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం వెలువడింది.
జాబ్ క్యాలెండర్ అంటూ గత ప్రభుత్వం ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగున్నరేళ్లు నాన్చి చివరకు ఎన్నికలకు ముందు డిసెంబర్ 7న హడావుడిగా 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. సిలబస్‌లో మార్పులు చేయడంతో అభ్యర్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోలేదు. 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరుకాగా 92వేల 250మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.