దావోస్ టూర్ లో పవన్ ఎందుకు లేరు ?
దాని కోసం చంద్రబాబు లోకేష్ ఈ నెల 19న ఏపీ నుంచి దావోస్ కి బయలుదేరి వెళ్తున్నారు.
By: Tupaki Desk | 16 Jan 2025 9:30 AM GMTఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఒక అంతర్జాతీయ వేదిక మీద జరిగే అతి పెద్ద సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అటెండ్ అవుతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు వెళ్తున్నారు. వారిలో ఒకరు నారా లోకేష్ అయితే మరొకరు టీజీ భరత్. ఇక సీనియర్ అఫీషియల్స్ కూడా బాబు బృందంలో ఉన్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్నారు. దాని కోసం చంద్రబాబు లోకేష్ ఈ నెల 19న ఏపీ నుంచి దావోస్ కి బయలుదేరి వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే దావోస్ సదస్సుకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ ఎందుకు వెళ్ళడం లేదు అన్న ప్రశ్న ఎదురవుతోంది. దానిని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్న వారూ ఉన్నారు. పవన్ ని కాకుండా లోకేష్ ని తీసుకుని వెళ్తున్నారని ఒక విధంగా నంబర్ టూ గా ఇంటర్నేషనల్ వేదిక మీద లోకేష్ ని ఫోకస్ చేసేందుకే ఇదంతా అని ప్రచారం చేసే వారూ చేస్తున్నారు.
మరో వైపు కూటమిలో టీడీపీకి జనసేనకు మధ్య గ్యాప్ ఉందని అందుకే ఇలా చేస్తున్నారు అని అంటున్న వారూ ఉన్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే అలాంటిది ఏదీ లేదనేదే. పవన్ చూస్తున్న శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. అందువల్ల ఆయన దావోస్ లో జరిగే టూర్ కి ఆయన శాఖాపరంగా పెద్దగా పెట్టుబడుల కోసం వెళ్లాల్సింది ఉండదని అంటున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రిని తీసుకుని వెళ్లాలి కదా అన్న పాయింటే వస్తే తెలంగాణాలోనూ మల్లు భట్టి విక్రమార్కను అక్కడి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వెళ్లడం లేదు అని గుర్తు చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుని తీసుకుని వెళ్తున్నారు. ఆ విధంగానే ఏపీలో కూడా ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ ని అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ని వెంట బెట్టుకుని వెళ్తున్నారు అని అంటున్నారు
విషయం ఇంత క్లారిటీగా ఉంటే బాబు పవన్ ల మధ్య గ్యాప్ అని అందుకే దావోస్ కి పవన్ ని తీసుకుని వెళ్లడం లేదని రాసే వారు రాస్తున్నారు. ప్రచారం చేసే వారు చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ని కూడా దావోస్ టూర్ కి దూరంగా ఉంచారు. ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన ఎంతో కొంత రిలవెంట్ అని కూడా చెబుతున్నారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ దావోస్ టూర్ వెళ్లకపోవడానికి కారణం ఏదీ ప్రత్యేకంగా లేదని అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మంత్రులతోనే బాబు ఈ టూర్ చేస్తున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి పవన్ లేకుండా బాబు తొలి విదేశీ టూర్ చేస్తున్నారని పక్కన లోకేష్ ఉంటున్నారని సాగుతున్న ప్రచారంలో వాస్తవాలు అయితే లేవని ప్రభుత్వ పార్టీ వర్గాల నుంచి వస్తున్న జవాబు. మరి ఈ క్లారిటీ సరిపోతుందా చాలాదా అంటే వేచి చూడాల్సిందే.