ఏమిటీ డిక్లరేషన్? తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సంతకం ఎందుకు?
తాము సదరు మతాన్ని.. వారి విశ్వాసాల్ని విశ్వసిస్తామన్న ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 27 Sep 2024 4:52 AM GMTతిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ప్రత్యేకంగా హిందువులకు.. హిందూ మతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అదే సమయంలో.. అన్యమతస్తులు ఎవరైనా తిరుమలకు వచ్చి.. శ్రీవారిని దర్శించుకోవాలంటే వారు తమ వివరాల్ని పేర్కొంటూ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి తీరు ఒక్క తిరుమలలోనే కాదు.. ఏ మతానికైనా ఉంటుంది. అన్య మతస్తులు తమ ప్రార్థనాలయాల్లోకి ప్రవేశించేందుకు పరిమితులు ఉంటాయి. తాము సదరు మతాన్ని.. వారి విశ్వాసాల్ని విశ్వసిస్తామన్న ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుంది.
అదే రీతిలో తిరుమలలో కూడా అలాంటి విధానాన్నే ఫాలో అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్యమతస్తులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తమకు తాము స్వచ్ఛదంగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ చట్టంలోని 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది.
దీని ప్రకారం హిందువులు కాని అన్యమస్తులు ఎవరైనా సరే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఆలయంలోకి వెళ్లటానికి ముందే హిందూ మతాన్ని.. విశ్వాసాల్ని విశ్వసిస్తానంటూ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి చెందిన వ్యక్తినని.. అయినప్పటికీ శ్రీవేంకటేశ్వరస్వామిపై తనకు నమ్మకం.. గౌరవం ఉన్నాయని.. అందుకే దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తమ వివరాల్ని నమోదు చేసి.. సంతకం పెట్టి టీటీడీకి ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి శనివారం స్వామి వారిని దర్శించుకోనున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది.