సోమవారమే ఆత్మహత్యలు ఎందుకు..? పరిశోధనల్లో తేలిందేంటి..?
సోమవారం పని ఒత్తిడి, సెలవుల తర్వాత తిరిగి పనిచేయడం వంటి కారణాలు ఆత్మహత్యలను ప్రేరిపిస్తున్నట్లుగా వెల్లడించారు.
By: Tupaki Desk | 29 Oct 2024 1:30 PM GMTభారతదేశంలో రోజురోజుకూ ఆత్మహత్యల రేటు పెరుగుతూనే ఉంది. అది చిన్నవారి నుంచి పెద్ద వారి వరకూ.. పురుషులు, మహిళలు నిత్యం సూసైడ్ చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కారణాలు ఏవైనా చివరకు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రపంచవ్యా్ప్తంగా ఏటా 70 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే.. బీఎంజే మెడికల్ జర్నల్ చేసిన పరిశోధనలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది.
ఆత్మహత్యలు ఇదర దేశాల్లో కంటే భారతదేశంలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అందులోనూ 15 నుంచి 19 ఏళ్ల వయసు వారు ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లుగా అంచనా వేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 40శాతానికి పైగా 30 ఏళ్ల లోపు యువతే ఉన్నట్లుగా వెల్లడైంది. ఆత్మహత్యల నివారణకు ఏటా అవగాహన పెంచేందుకు కృషి చేస్తూనే ఉంది.
రిలేషన్‌షిప్స్ విఫలం కావడం, ఒత్తిడికి గురికావడం.. ఒంటరితనం.. ఇలా తదితర కారణాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అయితే.. బీఎంజే మెడికల్ జర్నల్ పరిశోధన ప్రకారం సోమవారం రోజే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్న ఆత్మహత్యలను వీరు విశ్లేషించారు. వీరి విశ్లేషణలో ఇతర రోజుల కంటే సోమవారం రోజునే ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు అవుతుండడాన్ని గుర్తించారు. 1971 నుంచి 2019 మధ్య 26 దేశాలలో 1.7 మిలియన్ల ఆత్మహత్యలపై బీఎంజే జర్నల్ స్టడీ చేసింది. ప్రధానంగా.. అమెరికా, ఆసియా, ఐరోపా దేశాలైన చెక్ రిపబ్లికన్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇటలీ, రొమేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యూకేలలో అధ్యయనం చేశారు. ఈ దేశాల్లో ఎక్కువ మంది సోమవారమే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉందట.
అయితే.. సోమవారమే ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నారని యూకేలోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ సోషల్ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా ఓషీయా ఈ విషయమై స్పందించారు. సోమవారం పని ఒత్తిడి, సెలవుల తర్వాత తిరిగి పనిచేయడం వంటి కారణాలు ఆత్మహత్యలను ప్రేరిపిస్తున్నట్లుగా వెల్లడించారు. శుక్రవారం ప్రజలు మంచి మూడ్‌లో ఉంటారని, వారాంతం కోసం ఎదురుచూస్తుంటారని, శని, ఆదివారాల్లో సెలవులు కావడం వల్ల కుటుంబసభ్యులను కలుస్తారని తెలిపారు. వారితో ఆనందంగా గడిపడం వల్ల సోమవారం పనిలో ఒత్తిడికి గురవుతారని.. పని ఒత్తిడి భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అది కాస్త ఆత్మహత్యలకు దారితీస్తున్నదని తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి వివిధ దేశాల సామాజిక అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.