వై ఏపీ నీడ్స్ జగన్...కొత్త నినాదంతో వైసీపీ
ఈ పవర్ ఫుల్ స్లోగన్ తో జనంలోకి ఎమ్మెల్యేలు అంతా వెళ్లాలని జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో 151 కాదు ఏకంగా 175 సీట్లను గెలుచుకోవాలని కూడా ఆయన పిలుపు ఇస్తున్నారు.
By: Tupaki Desk | 27 Sep 2023 2:30 AM GMTవై నాట్ 175 అన్న నినాదాన్ని కొన్నాళ్ల క్రితం ఇచ్చి ఏపీలో పాజిటివ్ వేవ్ తమకే ఉందని, పాజిటివ్ ఓటు కూడా తమకే దక్కుతుందని చెప్పుకుని ముందుకు వెళ్ళిన వైసీపీ ఇపుడు సరికొత్త నినాదాన్ని ఆవిష్కరించింది. అదే వై ఏపీ నీడ్స్ జగన్ అన్నది ఆ నినాదం.
ఈ పవర్ ఫుల్ స్లోగన్ తో జనంలోకి ఎమ్మెల్యేలు అంతా వెళ్లాలని జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో 151 కాదు ఏకంగా 175 సీట్లను గెలుచుకోవాలని కూడా ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇక ఏపీలో ఇపుడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఒక వైపు చంద్రబాబు అరెస్ట్ అయి గత పదిహేను రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో వైపు చూస్తే విపక్షాలు కూటమి కడతామని అంటున్నాయి. ఇక పాజిటివ్ ఓటు అంతా మాదే అన్న మొక్కవోని ధైర్యంతో ఉన్న వైసీపీ ఆ డైరెక్షన్ లోనే ఎమ్మెల్యేలను జనంలోకి పంపుతోంది. సరికొత్త వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటోంది.
ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లు వైసీపీకే సాధ్యమని గెలుపు మనదే అంటూ తాడేపల్లిలో జరిగిన ఎమ్మెల్యేల సమీక్షలో జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుని బట్టే టికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఇందులో రాజీలు పేచీలు ఉండబోవని స్పష్టం చేశారు.
టికెట్లు ఎవరికైనా ఇవ్వకపోతే ఎలాంటి నిరాశ వద్దే వద్దు అని జగన్ ఉద్బోదించారు. టికెట్లు రాకపోతే వారికి ఇతర పదవులు ప్రభుత్వంలో ఇచ్చి వేరే విధంగా హోదాను కల్పిస్తామని వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని గట్టి భరోసా ఇచ్చారు.
ఇక గడప గడపకు తిరిగి వై ఏపీ నీడ్స్ జగన్ అన్నది జనాలకు చేరువ చేయాలని బిగ్ టాస్క్ ఇచ్చారు జగన్. జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యలు అందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఇక వచ్చే ఆరేడు నెలలు పార్టీకి చాలా ముఖ్యమని జగన్ చెప్పడం విశేషం. ఎమ్మెల్యేలు స్పీడ్ పెంచాలని అలాగే గేర్ మార్చాలని కూడా పిలుపు ఇచ్చారు. ఇప్పటిదాకా ఎవరెంత చేసినా ఎవరి పనితీరు ఎలా ఉన్నా ఇక ముందు ఉన్నదే అత్యంత కీలకమని జగన్ అంటున్నారు.
ఇక పార్టీ వివిధ రకాలైన సర్వేలు చేయించిందని అందులో ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూలత ఉందని జగన్ చెప్పడం విశేషం. పార్టీ జనంలో ఉందని ఆయన అంటున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలితాలు జనంలో బాగా వెళ్లాయని ఆయన అంటున్నారు.
వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేకనే విపక్షాలు అన్నీ కలవాలని చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ ఎంత బలంగా ఉంది అన్నది విపక్షాలేఅ చెప్పకనే చెబుతున్నాయని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 29 నుంచి 45 రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని, ఆ తరువాత ఏపీకి జగన్ ఎందుకు కావాలి' అనే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. మొత్తానికి జగన్ కొత్త నినాదంతో జనంలోకి ఎమ్మెల్యేలను పంపుతున్నారు అన్న మాట.