Begin typing your search above and press return to search.

అసలు కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత!

కెనడా ప్రధాని సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:30 PM GMT
అసలు కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత!
X

తమ దేశ పౌరుడు, ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లు చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కెనడా ప్రధాని ట్రూడో.. ఆ దేశంలో భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. దీనికి దీటుగా ప్రతిస్పందించిన భారత్‌.. మనదేశంలోని కెనడా దౌత్యవేత్తను కూడా దేశం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా కెనడియన్లకు వీసాల జారీని నిలిపేసింది.

అయినా జస్టిన్‌ ట్రూడో వెనక్కి తగ్గడం లేదు. భారత్‌ పైన హత్య ఆరోపణలను చేస్తూనే ఉన్నారు. తాము చేసే దర్యాప్తులో భారత్‌ కూడా పాలుపంచుకోవాలని.. తమ దర్యాప్తుకు సహకరించాలని ట్రూడో కోరుతున్నారు. అంతేకాకుండా కెనడా మిత్ర దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల అధినేతలు, ప్రధానులకు కూడా భారత్‌ పైన ఆయన ఫిర్యాదులు చేశారు. ఈ విషయంలో భారత్‌ పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడాతో పోలిస్తే అన్నింటా ముందున్న భారత్‌ పైకే కాలు దువ్వుతున్న ట్రూడో సిక్కులను ఎందుకు నెత్తినపెట్టుకుంటున్నారనే అంశం ఆసక్తి రేపుతోంది.

ప్రపంచంలో విస్తీర్ణంపరంగా రష్యా తర్వాత రెండో అతిపెద్ద దేశమైన కెనడాలో

2021 జనాభా లెక్కల ప్రకారం.. 3.70 కోట్ల జనాభా మాత్రమే ఉంది. ఇందులో 16 లక్షల మంది భారతీయులే. 1970వ దశకం నుంచి కెనడాకు పెద్ద ఎత్తున భారతీయులు ఉద్యోగులు, చదువుల నిమిత్తం వలసపోయారు. ఆ తర్వాతే అక్కడే కెనడా పౌరసత్వం పొందారు. అంటే వారు భారత పౌరసత్వాన్ని వదులుకుని కెనడా పౌరులుగా నిలిచిపోయారు.

కెనడా జనాభాలో దాదాపు 4 శాతం భారతీయులేనని తెలుస్తోంది. ఇక కెనడా భారతీయ జనాభాలో సిక్కులు 7,70,000 మందిగా ఉన్నారు. ముఖ్యంగా గత 20 ఏళ్ల నుంచి కెనడాలో సిక్కు జనాభా ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం హరియాణా, పంజాబ్‌ నుంచి పెద్ద ఎత్తున కెనడాకు వలస వెళ్లి అక్కడే సెటిల్‌ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో కెనడాలో రాజకీయంగానూ సిక్కులు ప్రభావం చూపుతున్నారు. కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉండటం గమనార్హం. ఈ 18 మంది ప్రస్తుతం ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అందుకే జస్టిన్‌ ట్రూడో సిక్కులను వెనకేసుకొస్తున్నారు.

జస్టిన్‌ ట్రూడో 2015 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిక్కులకు మరింత ప్రాధాన్యత పెరిగిపోయింది. సిక్కు వర్గం నుంచే కేవలం నలుగురు మంత్రులను నియమించారు. అత్యధికంగా సిక్కు వర్గం నుంచే నలుగురు మంత్రులు ఉండటం గమనార్హం.

కెనడా జనాభాలో క్రిస్టియన్స్, ముస్లిం, హిందువుల తర్వాత సిక్కులు నాలుగో పెద్ద సమూహంగా ఉన్నారు. సిక్కులు ప్రధానంగా ఒంటారియో, బ్రిటీష్‌ కొలంబియా, అల్బెర్టాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. పంజాబీ భాష కెనడాలో మూడో పాపులర్‌ భాషగా ఉండటం విశేషం.

ముఖ్యంగా కెనడా నిర్మాణ రంగం, రవాణా, బ్యాంకింగ్‌ రంగాలలో సిక్కులు కెనడా ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. చాలా మంది సిక్కులు హోటల్, రెస్టారెంట్, గ్యాస్‌ స్టేషన్‌ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. 1980లో కెనడాలో కేవలం 35 వేల మంది సిక్కులు మాత్రమే పౌరసత్వం పొందగా ప్రస్తుతం వారి సంఖ్య 4.15 లక్షల మంది శాశ్వత నివాసాన్ని పొందారు.

సిక్కులు కెనడాలో ఇంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి వారి గురుద్వారాలే కారణమని అంటున్నారు. గురుద్వారాల ద్వారా పెద్ద ఎత్తున సిక్కులు ఫండ్లు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. వాటిని పార్లమెంటు ఎన్నికల సమయంలో ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల్లో బరిలోకి దిగి విజయాలు సాధిస్తున్నారు. దీంతో మద్దతు అవసరమైనప్పుడు ప్రధాన పార్టీలు సిక్కుల మద్దతును కోరుతున్నాయి. దీంతో వారికి ప్రాధాన్యత పెరిగిపోయింది.