Begin typing your search above and press return to search.

ఆడ బిడ్డల టాపిక్ ఎందుకు లోకేష్?

ఈ ఉపోధ్గాతం సంగతి కాసేపు పక్కనపెడితే... గతకొన్ని రోజులుగా నారా లోకేష్ కనిపించడం లేదనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jan 2024 12:58 PM GMT
ఆడ బిడ్డల టాపిక్  ఎందుకు లోకేష్?
X

అనుభవ రాహిత్యమో.. అవగాహనా లోపమో.. కుసంస్కార ప్రభావమో.. అలా మాట్లాడితే మాస్ లీడర్ అయిపోవచ్చనే తాపత్రయమో తెలియదు కానీ.. చాలా మంది నేతలు సమయం, సందర్భం లేకుండా కొన్ని విషయాలపై అనవసరంగా స్పందిస్తుంటారు.. అక్కరలేని అంశాలను ఎత్తుకుంటూ ఉంటారు.. ఫలితంగా రిజల్ట్ రివర్స్ అయ్యేసరికి మైకుల ముందు కొందరు, ఇంట్లో తలుపులేసుకుని ఇంకొందరు లబోదిబోమంటుంటారు! దీంతో... "అడుసు తొక్కనేల కాలు కడుగనేల" అనే కామెంట్లు చేస్తుంటారు పరిశీలకులు!

ఈ ఉపోధ్గాతం సంగతి కాసేపు పక్కనపెడితే... గతకొన్ని రోజులుగా నారా లోకేష్ కనిపించడం లేదనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.. మీడియాలోనూ వినిపించడం లేదు.. నెట్టింట స్పందన కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తుందనే ప్రచారం జరిగింది. ఈ సమయంలో... నారా లోకేష్ గురించి ఒక సంచలన విషయం సోషల్ మీడియాలో తీవ్ర రచ్చ రేపింది. ఇందులో భాగంగా.. “లోకేష్ ని అమెరికాలో అరెస్ట్ చేశారు” అనేది ఆ టాపిక్.

కట్ చేస్తే తాజాగా హైదరాబాద్ నుంచి గన్నవరానికి విమానంలో వచ్చారు లోకేష్. ఈ సందర్భంగా అమెరికాలో మనీలాండరింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇందులో భాగంగా... తన అరెస్టుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఘాటుగా రియాక్ట్ అయిన ఆయన... "అమెరికాలో అరెస్టు చేసింది నన్నా, జగన్ రెడ్డినా, జగన్ కూతురినా, భారతీ రెడ్డినా" అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.

ఇదే సమయంలో... తనపై జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయిన లోకేష్.. సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన గాడిదలను తన అరెస్టు గురించి అడగాలంటూ వ్యాఖ్యానించారు. తద్వారా ఈ వార్తలన్నీ ఫేక్ అని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లున్నారు. అయితే... తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని చెప్పాలనుకున్నా.. ఇందులో రాజకీయ కోణం ఉందని, వైసీపీ హస్తం ఉందని భావిస్తూ దాన్ని ఖండించాలనుకున్నా.. లోకేష్ కు వేరే దారుంది.

అవును... నిజంగా మనీలాండరింగ్ కేసులో లోకేష్ అరెస్టు అయిన అంశాన్ని వైసీపీ జనాలో, జగన్ మోహన్ రెడ్డో చేశారని లోకేష్ భావిస్తే... రాజకీయంగా జగన్ పైనా, వైసీపీ సోషల్ మీడియా జనాలపైనా ఎన్ని విమర్శలు చేసినా పర్లేదు!! దానికి వైసీపీ నుంచి రావాల్సిన స్థాయిలో కౌంటర్సో, వివరణలో వస్తాయి.. అది ఉన్నంతలో ఆరోగ్యకరంగా ఉంటుంది అని అనుకోవచ్చు! అంతే కానీ... ఈ వ్యవహారంలోకి ఆడ బిడ్డలను లాగడం ఎంతవరకూ సమంజసమో లోకేష్ కే తెలియాలి!

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకూ ఆయన సతీమణి భారతి... పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖళాలు లేవనే చెప్పాలి! ఏనాడూ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కూడా లేదు!! ఇక జగన్ కుమార్తె అంటారా.. ఆమె విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటూ, తండ్రికి తగ్గ తనయగా ఉన్నత స్థానంలో ఉండాలని ఉన్నతంగా చదువుకుంటుంది! పైగా ఆమె మేనేజ్ మెంట్ కోటా బ్యాచ్ కాదు.. కష్టపడి సీటు సంపాదించుకుందని చెబుతారు. ఈ క్రమంలో లోకేష్... ఆమె ప్రస్థావన కూడా తీయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. అమెరికాలో తన అరెస్ట్ వార్తలను ఖండించడానికి సవాలక్ష మార్గాలుంటాయని... దీనికోసం జగన్ సతీమణి భారతిని, జగన్ కుమార్తెను సైతం లోకేష్ ప్రస్థావించడం ఏమాత్రం సరైన ఆలోచన కాదని... ఈ విషయంలో లోకేష్ కి ఇంకాస్త ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. పైగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఆ స్థాయిలో పతనమవ్వడానికి చినబాబే కారణం అని.. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నో ఒడిదుడులకు ఆయన ప్రవర్తనే మూలమని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఇలా పార్టీకి డ్యామేజ్ తెస్తూ, సమాజాం ఏమాత్రం అంగీకరించని, సమాజానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ప్రస్థావనలు తెవడం, విమర్శలు చేయడం సహేతుకం కాదని అంటున్నారు పరిశీలకులు.

ఈ సమయంలో ఈ కామెంట్లపై వైసీపీ నేతలు మైకులముందుకు వచ్చి మొదలుపెడితే... లోకేష్ వల్ల ఆయన ఇంట్లో మహిళలు సైతం మాటలు పడాల్సిన పరిస్థితిని తనే కోరితెచ్చుకున్నట్లు అవుతుందనే అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా... రాజకీయాల్లో ఇలాంటి పోకడలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. సమయమనం లేని, సంస్కారం లేని రాజకీయాలు సమాజానికి మేలుకంటే కీడే ఎక్కువగా చేస్తాయని చెబుతున్నారు.