పట్టుమని పది రోజులు ఉండకపోతే ఎలా జగన్?
అయితే.. 2014 ఎన్నికల్లో ఓడిన సందర్భంలో జగన్ ఎక్కువగా హైదరాబాద్ ఉండేవారు.
By: Tupaki Desk | 9 Aug 2024 1:30 AM GMTఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో నాటి విపక్షనేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా విమర్శలు సంధించేవారు. వారెప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటున్నారని.. అమరావతికి చుట్టపు చూపుగా వస్తారని విమర్శలు చేసేవారు. అలాంటి వారిని ఎన్నుకోకూడదని ప్రజలకు పదే పదే చెప్పేవారు. అయితే.. 2014 ఎన్నికల్లో ఓడిన సందర్భంలో జగన్ ఎక్కువగా హైదరాబాద్ ఉండేవారు. ఇదే విషయాన్ని టీడీపీ తమ్ముళ్లు.. జనసైనికులు ప్రస్తావించేవారు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న జగన్.. ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. అమరావతికి వచ్చి పోతున్న ఆయన.. ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని రావటం.. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోవటం తెలిసిందే. తాజాగా నంద్యాల జిల్లా పర్యటనకు వెళుతున్న జగన్.. అక్కడ తన టూర్ ముగిసిన తర్వాత కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి బెంగలూరుకు వెళ్లనున్నారు.
మరోమూడు.. నాలుగురోజులు అక్కడే ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వైసీపీకి చెందిన పలువురిని బెంగళూరు క్యాంప్ నకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమకు పూర్తిస్థాయి బలం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా తన సత్తా చాటాలని భావిస్తున్నారు.
మరోవైపు.. ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో తమ సొంతం చేసుకోవాలని కూటమి భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోనే ఉండాలని అప్పటి విపక్షాన్ని ప్రశ్నించిన జగన్.. అందుకు భిన్నంగా ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉండటం నెగిటివ్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. వీలైనంత ఎక్కువగా తాడేపల్లిలోని నివాసంలోనే జగన్ ఉండాలని.. ప్రజలకు అందుబాటులో ఉండటం ద్వారా ప్రజలకు చేరువ అవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలాి.