Begin typing your search above and press return to search.

జగన్ ఎమ్మెల్యేకి రాజీనామా అనేది ఒక ఊహా న్యూస్... పెద్ద వైరల్ !

కానీ దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లుగా ఒక వూహాత్మకమైన న్యూస్ ని వండి వార్చారు.

By:  Tupaki Desk   |   9 July 2024 1:27 PM GMT
జగన్ ఎమ్మెల్యేకి రాజీనామా అనేది ఒక ఊహా న్యూస్... పెద్ద వైరల్ !
X

జగన్ సీఎం గా అయిదేళ్ల పాటు పనిచేశారు. ఆయన మళ్లీ సీఎం కావడానికే చూస్తారు. ఢిల్లీ రాజకీయాలు జగన్ ఎందుకు చేస్తారు అన్న చర్చ అయితే ఉంటుంది కదా. కానీ దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లుగా ఒక వూహాత్మకమైన న్యూస్ ని వండి వార్చారు. అది కాస్తా ఇపుడు పెద్ద వైరల్ అయింది.

నిజానికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ న్యూస్ ఎందుకు నమ్మాలని కూడా అనిపిస్తుస్తుంది. జగన్ ఏపీలో ఉండాలి. అసెంబ్లీలో ఉండాలి. ఆయన ప్రతిపక్ష నేత స్థానంలో ఉంటేనే అధికార టీడీపీ కూటమిని నిలదీయగలరు. ఆయన మళ్లీ సీఎం కావాలీ అంటే టీడీపీని కూటమిని బలంగా టార్గెట్ చేయాలి.

దానికి గల అవకాశాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండడమే. అలాంటిది జగన్ వెళ్ళి ఢిల్లీలో ఎందుకు కూర్చుంటారు. పోనీ కాసేపు ఇదే నిజమని అనుకున్నా పార్లమెంట్ లో జగన్ ఏమీ అధికార కూటమిలో భాగస్వామి కాదు కదా. ఆయన ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవులు దక్కవు కదా.

ఆయన నలుగురు ఎంపీలతో ఢిల్లీలో కూర్చోవాలి. అది కూడా మొత్తం పార్లమెంట్ లో 41 పార్టీలు ఉంటే వారికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం జగన్ పార్టీది 15వ స్థానం. ఏ చర్చ జరిగినా ఆ విధంగానే చివరాఖరి చాన్స్ లభిస్తుంది. అది కూడా అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. అలా విపక్ష ఎంపీగా 543 మందిలో ఒకరుగా జగన్ కూర్చుంటే లాభం ఏంటి అన్నది కదా చర్చ.

ఇదిలా ఉంటే ఎందుకు పుట్టించారో కానీ కనీస మాత్రంగా ఆలోచన లేకుండా లాజిక్ అసలు లేకుండా పుట్టిన ఈ వార్త ఇపుడు వైరల్ అయింది. ఎంతలా అంటే తెలంగాణాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పడం. మరి ఒక సీఎం నోటి వెంట ఈ న్యూస్ వచ్చింది అంటే అది ఇంకా వైరల్ అవుతుంది కదా.

ఇపుడు అదే జరిగింది. నిజంగా టీడీపీ అనుకూల మీడియా ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తోంది అని అంటున్నారు. దానిని పట్టుకుని తెలంగాణా సీఎం ఏపీకి వచ్చి అదే చెప్పారు అంటే అది ఎంత పెద్ద వైరల్ న్యూస్ అయిందో గమనించాలి. ఊహతో వండిన ఈ న్యూస్ ఇంత పెద్దగా వైరల్ కావడం అది నెగిటివ్ న్యూస్ గా పొలిటికల్ సర్కిల్స్ లో తిరగడం తో ఆ న్యూస్ వెనక టార్గెట్ ఏంటి అన్నది అర్ధం అవుతోంది అంటున్నారు.

అయితే అంతా మరచిపోతున్న లాజిక్ ఏంటి అంటే సీఎం చేసిన వ్యక్తి ఎంపీగా ఎందుకు వెళ్తారు అన్నది. అసలు పులివెందుల సీటుకు జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు అన్నది కూడా ఆలోచించాలి కదా. సీఎం గా చేసిన వారు సీఎం గా మళ్ళీ ఆ సీటులోకి రావాలని చూస్తారు. ఇది కామన్ గా జరిగేది. దానిని వదిలి పెట్టి అర్జెంటు గా ఢిల్లీకి వెళ్ళి ఎంపీ అయి ఏమి సాధిస్తారు అన్నది కూడా ఆలోచించాలి కదా అంటున్నారు.

గతంలో చూస్తే చంద్రబాబు అసెంబ్లీని వదిలి వెళ్తూ మళ్లీ సీఎం గానే సభలోకి అడుగుపెడతాను అని చెప్పారు. అంతే తప్ప చంద్రబాబు ఢిల్లీకి పోలేదు కదా అని కూడా లాజిక్ పాయింట్ ని కొందరు లేవనెత్తుతున్నారు. జగన్ అయినా మళ్లీ అయిదేళ్ళ పాటు కష్టపడి సీఎం కావాలని కోరుకుంటారు తప్ప ఎంపీ ఎందుకు అవుతారు. దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి అన్నది కూడా ఇక్కడ చర్చగా ఉంది.

నిజానికి ఇపుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అలాగే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి రెండు చోట్ల ఉప ఎన్నికలు పెట్టించడం అంటే అది భారీ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి పూర్తి బలంతో ఉంది.

కడప ఎంపీ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కూటమి ఎమ్మెల్యేలే మెజారిటీ గెలిచి ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తే కనుక అధికార కూటమికే భారీ అడ్వాంటేజ్ గా ఉంటుంది. అన్ని వైపులా మోహరించి మరీ దెబ్బ తీయాలని చూస్తారు. అలాంటిది జగన్ ఇవన్నీ తెలిసి మరీ రిస్క్ చేయడానికి రెడీ అవుతారా అన్న చర్చ కూడా ఉంది.

రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహన ఉన్న వారు అయినా ఇలా చేయరు కదా అని అంటున్నారు. మరి ఇవన్నీ ఏ మాత్రం ఆలోచన చేయకుండా కడప ఉప ఎన్నికలు అంటే ఎలా ఉంది అంటే దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమని అన్నట్లే అంటున్నారు. ఈ ఊహాజనిత వార్తలను సీఎం స్థాయి వ్యక్తులు కూడా నమ్మి మాట్లాడంతోనే వైరల్ అవుతున్నాయని అంటున్నారు.