ఢిల్లీకి పవన్ ఎందుకు వెళ్ళలేదు ?
చంద్రబాబు వెంట ఏపీకి చెందిన కొందరు మంత్రులు ఢిల్లీ వెళ్లారు.
By: Tupaki Desk | 4 July 2024 6:01 PM GMTముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు. ఈ చర్చ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సర్వత్రా వస్తోంది. చంద్రబాబు పవన్ ఇద్దరూ కూటమి సారధులు. ఈ ఇద్దరూ కలసి బంపర్ విక్టరీని కొట్టారు. ఇద్దరూ ప్రభుత్వంలో ముఖ్య భాగస్వాములుగా ఉన్నారు.
అయితే చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన మొత్తం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు వెంట ఏపీకి చెందిన కొందరు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. అయితే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అన్న చర్చ సాగుతోంది.
పవన్ తానే రాను అని చెప్పారా లేక ఆయనని పక్కన పెట్టి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా అన్నది చర్చగా ఉంది. మొదటిది నిజమైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏ విలువా ఉండదు. కానీ రెండవది నిజమైతే మాత్రం కచ్చితంగా కూటమికి ఇబ్బంది కరమైన పరిస్థితే అని చెప్పాలి.
ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదు అని చర్చ సాగుతోంది. కూటమి కట్టడానికి ఆ మీదటా దాని విజయానికి ఎంతో కీలక పాత్ర పోషించిన పవన్ ఢిల్లీకి వెళ్తే బాగుండేది అని అంటున్నారు. ఏపీ కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఇద్దరూ కలిసి ప్రధాని మోడీకి చెప్పాల్సింది చెప్పి ఎక్కువ నిధులు సాధించేందుకు అవకాశం ఉండేది అని అంటున్నారు.
ఇక్కడ మరో చిత్రం కూడా జరిగింది.చంద్రబాబు వెళ్లిన టైం లోనే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. చంద్రబాబు దేశ హోం మంత్రి అమిత్ షాని కలసిన వెంటనే రేవంత్ కూడా ఆయనని కలిశారు. భట్టి కూడా ఈ భేటీలో పాలు పంచుకున్నారు.
ఇది తొలిసారి మాత్రమే కాదు. రేవంత్ రెడ్డి ఎపుడు ఢిల్లీ వచ్చినా పక్కన భట్టి కచ్చితంగా ఉంటున్నారు. మరి తెలంగాణాలో భట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో పవన్ ఉన్నారు. భట్టిని తీసుకెళ్ళిన మాదిరిగానే పవన్ ని కూడా ఢిల్లీకి తీసుకుని వెళ్తే బాగుండేది కదా అన్న చర్చ సాగుతోంది.
నిజానికి చంద్రబాబు పవన్ ల మధ్య విభేదాలు ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు. కానీ క్యాడర్ ఉంది. రెండు పార్టీలలో ఉన్న నాయకులు అభిమానులు ఉన్నారు. వారికి ఏ విషయంలోనూ తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలి కదా అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా తీసుకుని వెళ్ళి ప్రధానిని కలిస్తే మరింత ప్రయోజనకరం అయ్యేది అని కూడా సూచనలు వస్తున్నాయి.
అంతిమంగా ఏపీకి లాభం జరగాలి. ఏపీ అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో అంతా కలసికట్టుగా పనిచేస్తారనే కదా కూటమికి అధికారం అప్పగించినది అని అంటున్నారు. మరి మరో దఫా ఢిల్లీ టూర్ లో అయినా బాబు పవన్ కలసి వెళ్తారేమో చూడాల్సి ఉంది. లేకపోతే మాత్రం కూటమి విషయంలో అనుమానాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.