Begin typing your search above and press return to search.

బాబు - పవన్.. ఎవరి ఢిల్లీ టూర్ వారిదేనా?

కానీ.. భవిష్యత్తులో దూరం పెరగటానికి అవసరమైన బీజాలు ఒకటి తర్వాత ఒకటిగా పడుతున్న వైనాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 4:56 AM GMT
బాబు - పవన్.. ఎవరి ఢిల్లీ టూర్ వారిదేనా?
X

బాగా సాగే ప్రయాణాన్ని కోరి కష్టాలు కొని తెచ్చుకోవటం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఈ విషయాన్ని ఏపీలోని కూటమి సర్కారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు.. ఈ రోజుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఒకరినొకరు పరస్పర గౌరవాభిమానాలతో ముందుకు వెళుతున్నారు. కానీ.. భవిష్యత్తులో దూరం పెరగటానికి అవసరమైన బీజాలు ఒకటి తర్వాత ఒకటిగా పడుతున్న వైనాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు.

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ను పోలుస్తారా? లాంటి వాదనలను పక్కన పడేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అవునన్నా.. కాదన్నా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయంలో చంద్రబాబు - పవన్ ల పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ? మరెవరు తక్కువ? అన్నది ప్రశ్నే కాదు. అయితే.. అలాంటి చర్చకు అవకాశం ఇచ్చేలా ఈ ఇద్దరు అధినేతల వ్యవహారశైలి ఉండకూడదు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు చాలా అంశాల్ని పట్టించుకోరు. వారి విజన్ వేరుగా ఉంటుంది.కానీ.. జనసామ్యం ఆలోచనధోరణి అలా ఉండదు. వారిలో మొదలయ్యే చిన్న చిన్న వ్యత్యాసాలు తర్వాతి రోజుల్లో తీవ్రరూపం దాల్చి.. వాటి ప్రభావం అధినేతల మీద పడే వీలుంటుంది.

కలిసికట్టుగా వ్యవహరించే ధోరణి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా అయితే వ్యవహరిస్తున్నారో.. అదే తీరును చంద్రబాబు ఫాలో అయితే సమస్యలు సగం తీరిపోయినట్లే. అనవసర చర్చకు తెర దించినట్లే. నిన్నటికి నిన్న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే జనసేన అధినేత కం ఏపీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. అయితే.. పవన్ టూర్ లో మంత్రి హోదాలో ఢిల్లీలో జరిగే సమీక్షా సమావేశానికి హాజరవుతున్నారు. ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం ముందస్తుగా వచ్చి ఉంటుంది కాబట్టి.. ఢిల్లీకి వెళ్లే ముందు ఇద్దరు అధినేతలు కలిసికట్టుగా వెళ్లటం.. కేంద్రంలోని కీలక నేతల వద్దకు వెళ్లినప్పుడు ఇద్దరు కలిసి వెళ్లటం బాగుంటుంది. లేదంటే అనవసరమైన చర్చకు చేజేతులారా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

ఎక్కడిదాకానో ఎందుకు? తాజాగా చోటు చేసుకున్న పరిణామాణాన్నే తీసుకుంటే.. చంద్రబాబు ఢిల్లీ టూరుకు వెళ్లి వచ్చినంతనే.. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళుతున్నారన్న వాదన మొదలైంది. దీని లోతుల్లోకి వెళితే.. పవన్ టూరు వెనుక అసలు విషయం అర్థమవుతుంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జలజీవన్ మిషన్ రివ్యూ భేటీ ఉంది. పంచాయితీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పవన్ హాజరవుతున్నారు. ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని.. క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతుందన్నది కేంద్రం ఆలోచన. అందుకే రాష్ట్రాల మంత్రుల్ని ఢిల్లీకి ఆహ్వానించింది.

కానీ.. డ్రాయింగ్ రూంల్లో కూర్చొని తీర్పులు ఇచ్చే వారు.. ఇంత లోతుల్లోకి వెళ్లరు. ఈ విషయాల్ని చెప్పరు. వారి బుర్రలకు ఏం తడితే అదే చెబుతారు. అందులోని అర్థసత్యాలు సత్యాలు మాదిరి చెలామణీ అవుతుంది. అందునా ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా.. యూట్యూబ్ కాలం. అందులో ఎవరి బుర్రకో తట్టిన ఆలోచన.. ప్రధాన మీడియాలు సైతం ఫాలో కాక తప్పని పరిస్థితి. అందుకే.. దూరం పెరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర మంత్రి నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్ కు హాజరవుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్.. ఆ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిసే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే.. సామాన్య ప్రజల్లో జరిగే చర్చ.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. పవన్ ను తీసుకెళ్లలేదు.. అందుకే బాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినంతనే పవన్ బయలుదేరి వెళ్లారని. ఇలాంటి ప్రచారాలతో ఏం జరుగుతుంది? అని కొందరు ప్రశ్నించొచ్చు. కానీ.. తర్వాతి రోజుల్లో ఇలాంటి అంశాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. అందుకే.. కొన్ని అంశాల్ని కలిసికట్టుగా ఉన్నామన్న విషయాన్ని అవసరం లేకున్నా చెప్పాల్సిన అవసరం ఉందన్నది అటు చంద్రబాబు.. ఇటు పవన్ కల్యాణ్ లు గుర్తించాలని కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.