Begin typing your search above and press return to search.

రేవంత్ నోట ‘ఫార్మాసిటీ’ రద్దు లేదన్న మాట ఎందుకు?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో రేవంత్ నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది

By:  Tupaki Desk   |   2 Jan 2024 5:26 AM GMT
రేవంత్ నోట ‘ఫార్మాసిటీ’ రద్దు లేదన్న మాట ఎందుకు?
X

తొందరపాటు ప్రకటనలతో వచ్చే నష్టం..కష్టం.. ఇబ్బందుల్ని అప్పుడే ఫేస్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. పదేళ్ల కేసీఆర్ పాలనకు భిన్నంగా ఉండాలన్న బలమైన ఆకాంక్షతో నడుస్తున్న సీఎం రేవంత్.. అన్ని విషయాల్లోనూ పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగా చేసిన ప్రకటన ఆయన్ను ఇబ్బందికి గురి చేయటమే కాదు.. కొత్త ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో రేవంత్ నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది. దీని సారాంశం బీఆర్ఎస్ సర్కారు సిద్ధం చేసిన ఫార్మాసిటీని రద్దు చేయటం.. ఎయిర్ పోర్టు మెట్రోను క్యాన్సిల్ చేసినట్లుగా ప్రకటన చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన ఈ ప్రకటన పెను సంచలనంగా మారటంతో పాటు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై పెను ప్రభావాన్ని చూపింది. తాను చేసిన ప్రకటన కారణంగా జరిగే నష్టాన్ని రోజుల వ్యవధిలోనే గుర్తించిన రేవంత్.. నష్టనివారణ చర్యల్ని చేపట్టారు.

ఇందుకోసం సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న ఆయన.. జనవరి 1న పురస్కరించుకొని కొందరు జర్నలిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ ను ప్రత్యేకంగా కలిశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. వాటి అమలుకు కేసీఆర్ ససేమిరా అనటంతో వందలాది మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. రేవంత్ మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వటమే కాదు.. జనవరి 1 నుంచి వంద రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామన్న అభయాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా తాను గతంలో చేసిన ప్రకటనలతో చోటు చేసుకున్న నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమానికి తెర తీశారు. ఇందులో భాగంగా ఫార్మాసిటీని రద్దు చేయటం లేదని.. ఎయిర్ పోర్డు మెట్రోను క్యాన్సిల్ చేయటం లేదన్న మాటను పదే పదే బలంగా ఒత్తి పలికారు. ప్రజా ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని వాటిని స్ట్రీమ్ లైన్ చేయనున్నట్లు చెప్పిన రేవంత్.. తాజా ప్రకటనతో తొందరపాటుతో తాను చేసిన తప్పును దిద్దుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పాలి.

ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయటం ద్వారా.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల కారణంగా చోటు చేసుకున్న కన్ఫ్జూజన్ తో పాటు.. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టత ఇచ్చారని చెప్పాలి. అదే సమయంలో మెట్రో విస్తరణపైనా మరింత స్పష్టత ఇచ్చినట్లుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఇటీవల తాను చేసిన రెండు సంచలన ప్రకటనలకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందిని క్లియర్ చేసే దిశగా అడుగులు వేశారని చెప్పక తప్పదు.