బాబు రేవంత్ జాయింట్ ప్రెస్ మీట్ లేదేంటి ?
చివరికి మంత్రుల స్థాయి కమిటీలు అధికారుల స్థాయి కమిటీలు అని తీర్మానించారు.
By: Tupaki Desk | 6 July 2024 5:17 PM GMTఇద్దరు సీఎంలు కూర్చుని పరిష్కారానికి ఆలోచిస్తే కొన్ని అంశాలు అయినా కొలిక్కి రావాలి. కానీ అలా జరగలేదు. ఎవరి ప్రతిపాధనలు వారు పెట్టారు. ఎవరి ఆలోచనలు వారు చెప్పుకున్నారు. చివరికి మంత్రుల స్థాయి కమిటీలు అధికారుల స్థాయి కమిటీలు అని తీర్మానించారు.
ఈ వివరాలను తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాకి తెలియచేశారు. ఈ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు ఇవీ అంటూ ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో ముగ్గురు మెంబర్లతో రెండు రాష్ట్రాలు కమిటీలు వేస్తాయి అని అన్నారు.
రెండు వారాలలోగా ఈ కమిటీలు కూర్చుని అన్ని విభజన అంశాలు చర్చిస్తాయని భట్టి చెప్పారు. వారి స్థాయిలో కూడా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మంత్రుల స్థాయి కమిటీల ముందుకు వస్తాయని అన్నారు. తెలంగాణా ఆంధ్రా మంత్రుల కమిటీలు కూర్చుని వాటి మీద చర్చిస్తాయని అన్నారు.
ఇక అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మరోసారి సీఎంలు ఇద్దరూ భేటీ అవుతారని అక్కడ వాటికి పరిష్కారాలు కనుగొంటారు అని భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. సరే ఇదంతా బాగానే ఉంది. కానీ ముఖాముఖీగా సీఎంలు ఇద్దరూ కూర్చుంటేనే సమస్యలు అలా ఉన్నాయి. వాటిని అధికారుల స్థాయిలో ఎలా పరిష్కరిస్తారు. అలాగే మంత్రుల స్థాయిలో ఎలా చర్చించి సొల్యూషన్ తెస్తారు అన్నది చర్చగా ఉంది.
మరో వైపు చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ అయ్యారు. ఈ భేటీ తరువాత ఇద్దరు సీఎంలు మీడియాను ఉద్దేశించి జాయింట్ ప్రెస్ మీట్ పెడతారు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏదీ జరగలేదు. మరి ఈ భేటీలో కొన్ని అంశాలలో అయినా ఏకాభిప్రాయం వచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చేవారు అని అంటున్నారు.
కొత్తగా మంత్రుల స్థాయి కమిటీలు అధికారుల కమిటీలు అని తీర్మానించడమే ఈ భేటీలో అతి పెద్ద నిర్ణయంగా ఉంది అని అంటున్నారు. దాంతోనే జాయింట్ ప్రెస్ మీట్ అన్నది లేకుండా పోయిందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇది తొలి అడుగు అని కొందరు ఆ వైపూ ఈ వైపూ అంటున్నారు. మరి ఆ అడుగు రెండవ మూడవ అడుగుల దాకా సాగితేనే అర్ధం పరమార్ధం అని అంటున్నారు.