Begin typing your search above and press return to search.

వరుస పెట్టి బంగారం ధరలు తగ్గుతున్నాయి కారణమేంటి?

కానీ.. అంతకు మించి ఎందుకు తగ్గుతున్నట్లు? ఈ తగ్గింపు ఎంతవరకు వెళుతుంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   26 July 2024 6:30 AM GMT
వరుస పెట్టి బంగారం ధరలు తగ్గుతున్నాయి కారణమేంటి?
X

కేంద్రంలోని మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ లో బంగారం దిగుమతి మీద పన్ను భారాన్ని భారీగా తగ్గించటం తెలిసిందే. ఇప్పటివరకు బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతంగా ఉండేది. దాన్ని 6 శాతానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బంగారం ధర ఆ మేరకు తగ్గింది. ఇదిలా ఉంటే.. గడిచిన మూడు రోజులుగా వరుస పెట్టి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ఎందుకిలా? పన్ను తగ్గిస్తే.. ఆ మేరకు తగ్గటం ఓకే. కానీ.. అంతకు మించి ఎందుకు తగ్గుతున్నట్లు? ఈ తగ్గింపు ఎంతవరకు వెళుతుంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేంద్ర బడ్జెట్ లో తగ్గిన పన్ను కారణంగా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై దగ్గర దగ్గర రూ.3వేల వరకు తగ్గింది. ఆ తర్వాత అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గటం వెనుక బంగారు వ్యాపారులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం తమ వద్ద పోగుపడిన బంగారాన్ని.. పన్ను తగ్గింపు నేపథ్యంలో దాన్ని అమ్మేసుకోవటానికి ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కలిసి రావటంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది.

బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,650పలకగా.. గురువారం రూ.70,650 పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లోఈ థర మరికాస్త తక్కువగా ఉండటం గమనార్హం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.70,400 మాత్రమే ఉంది. ఓవైపు కేంద్రం పన్ను తగ్గించటం.. మరోవైపు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గటంతో.. తాజా పరిస్థితి నెలకొందంటున్నారు. జపాన్ లో వడ్డీ రేట్ల పెంపు.. ఇతర కేంద్ర బ్యాంకుల రేట్ల కోత వేయాలన్న ఆలోచన బంగారం డిమాండ్ ను తగ్గేలా చేసింది.

రానున్న రోజుల్లోకాస్తంత తగ్గినప్పటికి ఎక్కువగా తగ్గే అవకాశం లేదంటున్నారు. బంగారం కొనాలన్న ప్లానింగ్ లో ఉన్న వారికి ఇప్పుడు కొనుగోలు చేయటం మంచిదంటున్నారు. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారంతోనే ఈ వివరాల్ని అందిస్తున్నామే తప్పించి.. దీన్ని పక్కాగా ఫాలో కావాలని మాత్రం చెప్పట్లేదు. బంగారంపై మదుపు పెట్టాలన్న ఆలోచన ఉంటే.. మరింత శాస్త్రీయంగా లెక్కలు వేసుకొని.. నిపుణుల సలహాలతోనే తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.