Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ టికెట్లు ఇందుకే వద్దంటున్నారా ?

తాజాగా సీనియర్ నేతలతో కేసీయార్ మాట్లాడుతు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అసెంబ్లీ అభ్యర్ధులపైన జనాల్లో ఇంకా వ్యతిరేకత తగ్గలేదన్నారు.

By:  Tupaki Desk   |   5 March 2024 9:30 AM GMT
బీఆర్ఎస్ టికెట్లు ఇందుకే వద్దంటున్నారా ?
X

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయటానికి చాలామంది సీనియర్లు ముందుకు రావటం లేదు. సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ టికెట్లు ప్రకటించినా కొందరు పోటీకి వెనకాడుతున్నారు. ఎందుకీ పరిస్ధితి బీఆర్ఎస్ లో ఎదురవుతోంది ? ఎందుకంటే పార్టీ అధినేత కేసీయార్ వైఖరే కారణమని అర్ధమవుతోంది. తాజాగా సీనియర్ నేతలతో కేసీయార్ మాట్లాడుతు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అసెంబ్లీ అభ్యర్ధులపైన జనాల్లో ఇంకా వ్యతిరేకత తగ్గలేదన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని కూడా చెప్పారు.

ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజమన్నారు. ఎన్టీయార్ అంతటి వ్యక్తే ఓడిపోతే ఇక మనమెంత అని నిర్వేదంగా మాట్లాడారు. ఒడిదుడుకులు తప్పవని ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నారు. పార్టీని వదిలేసి వెళిపోతున్న వారివల్ల ఎలాంటి నష్టమూ లేదని కూడా చెప్పారు. ఎంతమంది నేతలు వదిలి వెళ్ళిపోతే పార్టీకి అంతమంచిదని కేసీయార్ తేల్చేశారు. ఇక్కడ కేసీఆర్ నేతలతో చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజమని అందరికీ తెలిసిందే. కాకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని బల్లగుద్ది పదేపదే చెప్పారు. తీరా చూస్తే ఓడిపోయారు.

పార్టీ ఓడిపోయిన తర్వాత ఇపుడేమంటున్నారంటే పార్టీ ఓడిపోతుందని తనకు 15 రోజులు ముందే తెలుసన్నారు. ఇక్కడే అభ్యర్థులు, సీనియర్ నేతలు కేసీయార్ పై మండిపోతున్నారు. పైగా పార్టీ ఓడిపోయి మూడు నెలలవుతున్నా ఇంకా ఓడిపోయిన ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో వ్యతిరేకత తగ్గలేదన్నారు. ఓడిపోయినా ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో వ్యతిరేకత తగ్గలేదని స్వయంగా కేసీఆర్ చెప్పడం గమనార్హం. మరలాంటపుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటానికి ఎవరు ముందుకొస్తారు ? జనాల్లో వ్యతిరేకత తగ్గలేదని స్వయంగా కేసీయారే చెప్పిన తర్వాత ఎంపీ అభ్యర్ధులకు జనాలు ఎందుకు ఓట్లేస్తారనే చర్చ సీనియర్లలో పెరిగిపోతోంది.

అందుకనే ఎంపీలుగా పోటీ చేయటానికి నేతలు ముందుకు రావటం లేదు. చేవెళ్ళ ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన పోటీ చేసే విషయంపై ఆలోచించుకుని చెబుతానన్నారు. ఇక్కడే మిగిలిన సీనియర్లలో పోటీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో ఎందుకు వ్యతిరేకత పెరిగిపోయిందో కేసీయార్ చెప్పలేకపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వం ఫెయిలైందని, జనాలు మోసం చేసిందని కేటీయార్, హరీష్ పదేపదే చెబుతున్నదాన్నే ఇపుడు కేసీయార్ చెప్పినట్లున్నారు.