ఇదో తండ్రి ఆవేదన.. కొడుకును తీసుకొని భార్య బంగ్లాదేశ్ కు గాయబ్!
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి ముంబయిలో నిర్మాణ కూలీగా పని చేసేవాడు.
By: Tupaki Desk | 25 Jun 2024 5:35 AM GMTరీల్ కథకు తీసిపోని ట్విస్టులున్న ఈ రియల్ కథ మొత్తం కొడుకు కోసం తపించే ఒక తండ్రి ఆ‘వేదన’. ప్రేమించి పెళ్లాడిన భార్య తమ దేశానికి చెందినది కాదన్నది ఒక చేదునిజమైతే.. తన దగ్గరున్న కొడుకును ఎత్తుకెళ్లిపోయి.. దేశం కాని దేశంలో ఉన్న వైనం ఇప్పుడా తండ్రికి ఎడతెగని వ్యధగా మారింది. భారత ప్రభుత్వం కలుగజేసుకొని తన కొడుకును తన దగ్గరకు చేర్చాలని కోరుతున్న ఒక నాన్న ఉదంతమిది. సినిమాటిక్ గా ఉండే ఈ రియల్ స్టోరీలోకి వెళితే..
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి ముంబయిలో నిర్మాణ కూలీగా పని చేసేవాడు. 2016లొ అతనికి రియా అనే మహిళ పరిచయమైంది. అక్కడి అమ్మాయి అనుకున్న తిరుపతి ఆమెను పెళ్లాడాడు. 2017లో వారికో కొడుకు పుట్టాడు. అతడికి విశాల్ అని పేరు పెట్టుకున్నారు. తిరుపతి సొంతూరికి వచ్చాడు. ఇదే సమయంలో రియా మరో వ్యక్తిని పెళ్లాడింది. దీంతో విషయం తెలిసిన తిరుపతి ముంబయి వెళ్లాడు. బాబును తీసుకెళ్లాలని రియా కోరటంతో కొడుకును తీసుకొని హైదరాబాద్ కు వచ్చేశాడు.
నగరంలోని బాలాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కట్ చేస్తే.. 2022లో కొడుకును చూస్తానని రియా ఫోన్ చేసి అడగటంతో కొడుకును తీసుకొని ముంబయి వెళ్లాడు తిరుపతి. ఆ సమయంలో ఆమె రెండో భర్త.. మరికొందరు తిరుపతిపై దాడి చేసి ఐదేళ్ల వయసున్న కొడుకును తీసుకొని వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి పోలీసులకు కంప్లైంట్ చేశాడు తిరుపతి. అయినా.. ఫలితం లేకపోయింది.
తెలిసిన వ్యక్తుల ద్వారా ఆరా తీయగా.. రియాది భారత్ కాదని ఆమెది బంగ్లాదేశ్ లోని జెస్సోర్ అని.. కొడుకును అక్కడకు తీసుకెళ్లిందన్న సమాచారాన్ని తెలుసుకున్నాడు. దీంతో.. రియా సోదరి భర్త షఫీ ద్వారా కొడుకును తీసుకొచ్చేందుకు తిరుపతి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. ఇటీవల రూ.లక్ష తీసుకున్నాడు. కానీ..కొడుకును మాత్రం ఇండియాకు తీసుకురాలేదు. దీంతో.. తన కొడుకు కోసం తిరుపతి మరోసారి ప్రయత్నం చేయగా.. రూ.3.5 లక్షలు ఇస్తే కొడుకును అప్పగిస్తామని.. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి రావాలని చెప్పారు.
దీంతో కోల్ కతాకు వెళ్లిన తిరుపతికి ఈసారీ నిరాశే ఎదురైంది. కొడుకును చూపించకపోవటంతో నిరాశతో తిరుపతి వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ను కరీంనగర్ లో కలిసి సమస్యను వివరించాడు తిరుపతి. అధికారులకు ఈ విషయాన్ని చూడాలని తాను చెబుతానని చెప్పటంతో కొండంత ఆశతో కొడుకు కోసం ఎదురుచూస్తున్నాడు తిరుపతి. కొడుకు కోసం ఆరాటపడుతున్న తండ్రి ప్రయత్నం ఏ మేర ఫలిస్తుందో చూడాలి.