Begin typing your search above and press return to search.

కూటమిని షాకిచ్చేలా రెండో రాజధాని డిమాండ్

అన్ని ప్రాంతాల మధ్య ఎమోషన్స్ తో పాలిటిక్స్ చేయాలనుకుంటే మూడు ప్రాంతాలలో కూడా ప్రజలు వైసీపీని ఓడించేశారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 4:50 PM GMT
కూటమిని షాకిచ్చేలా రెండో రాజధాని డిమాండ్
X

వైసీపీ అయిదేళ్ళ పాలనలో మూడు రాజధానులు అంటూ కాలం వెళ్ళబుచ్చారు. అయిదేళ్ళ పాటు అలాగే కాలక్షేపం చేసారు. అన్ని ప్రాంతాల మధ్య ఎమోషన్స్ తో పాలిటిక్స్ చేయాలనుకుంటే మూడు ప్రాంతాలలో కూడా ప్రజలు వైసీపీని ఓడించేశారు.

ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతినే ఏకైక రాజధానిగా చేస్తామని ప్రకటించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ సహా ఇతర ఏజెన్సీల నుంది ఏకంగా ముప్పయి వేల కోట్ల రూపాయల నిధులను ఎస్తున్నారు.

మూడేళ్ళ కాల వ్యవధిలో అమరావతి రాజధానికి ఒక రూపూ షేపూ తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు రాజధానులు ముగిసిన ముచ్చట అని అంతా అనుకున్నారు. ఏపీకి ఏకైన రాజధాని అమరావతి అని అంతా ఫిక్స్ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో ఏపీకి రెండో రాజధాని కావాలని డిమాండ్ తెర మీదకు వస్తోంది. ఆ డిమాండ్ చేసిన వారు కూడా సామాన్య వ్యక్తి కాదు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వారే. అంతే కాదు ఏపీసీసీ ప్రెసిడెంట్ గా చాలా కాలం పాటు పనిచేసిన రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాధ్ సీమకు రెండవ రాజధాని కావాలని డిమాండ్ చేయడం ఇపుడు రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

రాయలసీమ దశాబ్దాలుగా అన్యాయానికి గురి అవుతోందని ఆయన అంటునారు. కర్నూల్ కి రాజధాని అయినా ఉండాలి లేదా హైకోర్టు అయినా రావాలని, కానీ హైకోర్టుని తీసుకుని వెళ్ళి అమరావతిలో ఏర్పాటు చేశారని అన్నారు. కేవలం హైకోర్టు బెంచ్ ని కర్నూలులో నెలకొల్పుతామని చెప్పడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి నిర్ణయం కాదని ఆయన అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని ఆయన కారారు. హైకోర్టు బెంచ్ అంటే రాయలసీమకు అన్యాయం చేసినట్లే అని శైలజానాధ్ అంటున్నారు.

అంతే కాదని కడప కేంద్రంగా ఉన్న ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని తీసుకుని వెళ్ళి అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ ఆఫీసు కడపలో ఉంటే వచ్చిన ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

అమరావతిలోనే రాజధానితో పాటు హైకోర్టుని కూఒడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రాయలసీమకు రెండో రాజధాని ఇవ్వాల్సిందే అని శైలజానాధ్ కొత్త ప్రతిపాదన ముందు పెట్టారు. అలా చేస్తేనే సీమకు న్యాయం జరుగుతుందని అన్నారు. అయితే ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మరోసారి ప్రాంతీయ విభేదాలు తలెత్తక మానవని కూడా ఆయన హెచ్చరించడం విశేషం. ప్రాంతీయ వాదం బలపడితే అది ప్రమాదం అని అన్నారు.

మొత్తం మీద చూస్తూంటే రాయలసీమలో రెండవ రాజధాని అంటూ ఈ రోజు శైలజానాధ్ వినిపించిన ఈ డిమాండ్ ఇక్కడితో మొదలవుతుందా లేక మామూలుగా ఆగిపోతుందా అన్నది కాలం చెప్పాలి. అయితే రాజకీయాల్లో మాత్రం ఇలాంటివి ఆగేవి ఉండవు కాబట్టి కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాయన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.