సంక్రాంతికి రోడ్లు సిద్ధమయ్యేనా?
ప్రభుత్వ నిర్దేశం ప్రకారం డిసెంబర్ మొదటివారంలో 2,511 కి.మీ., రెండో వారంలో 3 వేల కిలోమీటర్లు, మూడు, నాలుగో వారానికి 3,500 కిలోమీటర్లు, జనవరి 15 నాటికి 7,500 కిలోమీటర్లు పూర్తి చేయాలని లక్ష్యం విధించింది.
By: Tupaki Desk | 26 Dec 2024 9:30 AM GMTఏపీలో పెద్ద ఎత్తున చేపడుతున్న రోడ్ల మరమ్మతు పనులు లక్ష్యం మేరకు పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా గోతులమయైన రోడ్లను సంక్రాంతి నాటికి బాగు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గుంతల్లేని రహదారుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 2న మొదలైన ఈ కార్యక్రమంలో సంక్రాంతి నాటికి పాట్ హోల్ ఫ్రీ రోడ్లు ఉండాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇందుకోసం దాదాపు 861 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా పనులు జరుగుతున్నా, గత బకాయిలు, వాతావరణ ప్రతికూలతల వల్ల సంక్రాంతి నాటికి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో 19,911 కిలోమీటర్ల మేర రహదారులపై గోతులు పూడ్చాలని ప్రభుత్వం భావించింది. చాలా రోడ్లు కిలోమీటర్ల మేర గోతులతో నిండిపోవడంతో ప్రయాణం దుర్లభంగా మారింది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే రహదారుల మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సంక్రాంతి నాటికి వాటిని సుందరంగా తీర్చిదిద్దాలని భావించింది. గత ప్రభుత్వంలో రోడ్లను నిర్లక్ష్యం చేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు జోకులు వేసుకునే పరిస్థితి ఎదురైంది. దీంతో ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చీరాగానే రోడ్లు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించి 861 కోట్ల రూపాయలను సమకూర్చింది. నవంబర్ నుంచి జనవరి మధ్య 19,911 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాలని భావించింది. అయితే ప్రస్తుతం నిర్దేశించిన లక్ష్యంలో నాలుగో వంతు మాత్రమే పనులు అయ్యాయి. ప్రభుత్వ గడువు ప్రకారం ఇంకో 20 రోజులు సమయం ఉండగా, మిగిలిన పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
ఇటీవల ఈ పనులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్లాసు పీకారు. సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చేవారు ఎవరూ రోడ్లు బాగాలేవంటూ ఫిర్యాదు చేయకూడదని, అలాంటి విమర్శలు వస్తే స్థానిక ఎమ్మెల్యేలను బాధ్యులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానీ, కొన్ని ప్రధాన సమస్యలు రోడ్ల పనులు ముందుకు వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది రోడ్ల మరమ్మతులు చేసిన కాంట్రాక్లర్లకు సుమారు రూ.200 కోట్లు బకాయి ఉండిపోయింది. ఈ డబ్బు చెల్లిస్తే కానీ, కొత్త పనులు చేయలేమని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతుండటంతో పనులు ముందుకు కదలడం లేదు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలెంజ్ గా తీసుకుని గోతులు లేని రోడ్ల కార్యక్రమాన్ని చేపట్టింది. 19,911 కిలోమీటర్ల మేర మరమ్మతుల కోసం 4210 టెండర్లను పిలిచారు. కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేందుకు టెండర్లు వేసినా గత బకాయిలు చెల్లించాలనే నిబంధన విధిస్తూ పనులను ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు తుఫాన్లు, అల్పపీడనాల వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో రోడ్ల పనులు కదలడం లేదు.
ప్రభుత్వ నిర్దేశం ప్రకారం డిసెంబర్ మొదటివారంలో 2,511 కి.మీ., రెండో వారంలో 3 వేల కిలోమీటర్లు, మూడు, నాలుగో వారానికి 3,500 కిలోమీటర్లు, జనవరి 15 నాటికి 7,500 కిలోమీటర్లు పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. కానీ, ఇప్పటివరకు కేవలం 5 వేల కిలోమీటర్ల మేరే మరమ్మతులు పూర్తయ్యాయి. మరో 20 రోజుల్లో మిగిలిన పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.