మోడీ పవన్ దోస్తీ ఉంటే చాలా...బాబు ఆలోచనలు ఏంటి ?
అందుకే 2024లో హిట్ అయిన కూటమి పొత్తుల మ్యాజిక్ 2029లో రిపీట్ అవుతుందని ఆలోచిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 9 March 2025 2:00 AM ISTతెలుగుదేశం పార్టీ అధినేత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎపుడూ సేఫ్ జోన్ లోనే ఉండేలా చూస్తారు. అలాగే సేఫ్ గేమ్ ఆడేందుకు యత్నిస్తారు. ఆయన ప్రతీ ఎన్నికల తీర్పుని అధ్యయనం చేసి అదే రిపీట్ అవుతుందని కూడా భావిస్తారు. అందుకే 2024లో హిట్ అయిన కూటమి పొత్తుల మ్యాజిక్ 2029లో రిపీట్ అవుతుందని ఆలోచిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
నిజానికి ప్రజల తీర్పు ఎపుడూ ఒక్కలా ఉండదు. అంతవరకూ ఎందుకు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన తీర్పు ఆ తరువాత వెంటనే ఉప ఎన్నిక పెడితే వేరేగా వస్తుంది. అంటే జనాల ఆలోచనలు అలా మారుతూ ఉంటాయి. 2024లో మూడు పార్టీల పొత్తు సూపర్ హిట్ అయింది కాబట్టి ఈ పార్టీలు అన్నీ కలసికట్టుగా ఉండాలని బాబు కోరుకుంటున్నారు.
దాంతో పాటు ఆయన 2018లో ఎన్డీయే కూటమి నుంచి విడిపోయారు అందువల్ల మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని ఒకటికి వేయి సార్లు ఒట్టేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీని పొగుడుతున్నారు. మోడీ నుంచి ఎంతో నేర్చుకున్నాను అని అంటున్నారు. నిజానికి చూస్తే రాజకీయంగా మోడీ బాబు కంటే జూనియర్. ఆ సంగతి 2018 నుంచి 2019 మధ్యలో బాబు ఎన్నో సార్లు చెప్పారు కూడా.
ఇక దేశంలో హిందీ కూడా ఒక భాష అయినా దానిని రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం చూస్తోంది అని విపక్షాలు అంటున్నా బాబు మాత్రం దాని మీద మాట్లాడడం లేదు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని అంతా నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా ఎన్డీయే కీలకమైన భాగస్వామిగా ఉన్న బాబు ఆ విషయం మీద మాట్లాడడం లేదు.
ఎందుకు అంటే మోడీ తోడుగా ఉంటే ఏపీలో ఎప్పటికీ తమదే విజయం అని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ విషయంలో బాబు ఎక్కడా ఎన్నడూ చూపని రాజకీయ ఉదారతను చూపిస్తున్నారు అని అంటున్నారు. అది పవన్ కి ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తూ ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన ఫోటో పెట్టించాలని ఆదేశించడంతో మొదలై ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలను ఇవ్వడంతో పాటు ఆయనకు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చేదాకా సాగింది.
ఇక నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం ద్వారా పవన్ కోరికను బాబు తీర్చాలని చూస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి నాలుగు మంత్రి పదవులు అంటే 135 ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కాలన్నది కూడా తమ్ముళ్ళు లెక్క తీస్తున్నారు. అంతే కాదు బీజేపీకి కూడా రెండు మంత్రి పదవులు ఇవ్వాలి కదా అని ఏపీ కమలనాధులు అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో కూటమి పవర్ షేర్ ని జనసేన పూర్తిగా దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది అని బాబు కూటమితో ఎల్లకాలం ఉండాలని ఓకే చెబుతున్నారని అంటున్నారు.
దీని వల్ల తెలుగుదేశం వారి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని అంటున్నారు. అయితే 2029 ఎన్నికల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టిన బాబు మాత్రం ఈ విషయాలను పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. బాబు పవన్ ఉంటే చాలు మళ్ళీ మళ్ళీ టీడీపీకి విజయమే అని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కానీ ఎంతో డైనమిక్ గా ఆలోచించే ఓటర్లు 2029లో 2024 లాంటి తీర్పే ఇస్తారా అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.