Begin typing your search above and press return to search.

'బెంగళూరు ఈజ్ క్లోజ్డ్'... సోషల్ మీడియాలో కొత్త రచ్చ!

కర్ణాటకలో కన్నడ భాషపై అప్పుడప్పుడూ వివాదం నెలకొంటుండటం సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jan 2025 9:30 PM GMT
బెంగళూరు ఈజ్  క్లోజ్డ్... సోషల్  మీడియాలో కొత్త రచ్చ!
X

కర్ణాటకలో కన్నడ భాషపై అప్పుడప్పుడూ వివాదం నెలకొంటుండటం సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గతంలో... “మనమంతా కన్నడిగులం.. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.. రాష్ట్రంలో నివసించే ప్రజలంతా కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలి" అనే స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో రాష్ట్రంలో అన్ని సంస్థలపై 60శాతం సైన్ బోర్డులు కన్నడ భాషలోనే ఉత్తర్వ్యులు జారీ చేశారు! కర్ణాటకలో నివశించే ప్రజలంతా కన్నడ నేర్చుకోవాలని, కన్నడలోనే మాట్లాడాలనే డిమాండ్లు, సూచనలు వినిపించిన పరిస్థితి. ఈ సమయంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై ఇప్పుడు కన్నడ భాషపై మరోసారి చర్చ మొదలైంది.

అవును... "కన్నడ నేర్చుకోవడానికి ఇష్టపడని ఉత్తర భారతదేశం, పొరుగు రాష్ట్రాల ప్రజలకు బెంగళూరు మూసివేయబడింది" అని పేర్కొన్న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారగా.. దీనిపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా. భాషను నేర్చుకోవడం అనేది అక్కడి సంస్కృతిని గౌరవించే మార్గమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ సిటీలో అటువంటి డిమాండ్ అర్ధరహితం అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపై నెట్టింట చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. ఈ క్రమంలో ఈ పోస్ట్ తో కొంతమంది నెటిజన్లు ఏకీభవిస్తుండగా.. భాష నేర్చుకోవడం అనేది వ్యక్తిగత ఎంపిక అని, ఇది ఒక వ్యక్తిపై బలవంతంగా రుద్దబడకూడదని అంటున్నారు.

ఇదే సమయంలో.. "భారతదేశంలో కనీసం టాప్ - 5 భాషలను నేర్చుకోవాలనుకోని వారికి దేశం మూసివేయబడింది.. మీరు భారతీయుల భాష, సంస్కృతిని గౌరవించనప్పుడు మీకు భారతదేశం అవసరం లేదు" అని ఒక నెటిజన్ స్పందించగా.. కర్ణాటకలో ప్రవేశించే ముందు ఇతర రాష్ట్రాల వారికి కన్నడ భాషాపరిజ్ఞానంపై పరీక్ష పెట్టి, స్కోర్ బట్టి ఎంట్రీ ఇవ్వాలి" అని మరొకరు స్పందించారు.