కాంగ్రెస్ కు మరో ఘోర పరాభవం వెయిట్ చేస్తోందా?
అంతేనా.. హ్యాట్రిక్ విజయంతో ముచ్చటగా మూడుసార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఉనికి కోసం పోరు చేయాల్సిన దుస్థితి.
By: Tupaki Desk | 18 Jan 2025 5:15 AM GMTకాలం మహా చిత్రమైంది. ఎవరు కింగ్.. మరెవరు బొంగు అన్నది తేల్చేది కాలమే. ఎవరెంత ప్రభావం చూపుతారన్న దానికి కాలానికి మించిన పవర్ ఫుల్ మరొకటి ఉండదనే చెప్పాలి. ఢిల్లీ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవటం కోసం అగ్రపార్టీలు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే..ఒకప్పుడు ఆ పార్టీకి ఢిల్లీ కంచుకోట. షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీలో తిరుగులేని అధిక్యతను కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించేది. అంతేనా.. హ్యాట్రిక్ విజయంతో ముచ్చటగా మూడుసార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఉనికి కోసం పోరు చేయాల్సిన దుస్థితి.
గడిచిన రెండు దఫాలుగా ఢిల్లీ రాష్ట్రాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మూడోసారి విజయం సాధించటం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్ జోరుకు బ్రేకులు వేసి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని కమలనాథులు తపిస్తున్నారు. ఇలాంటి వేళలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికి కోసం పోరాడుతుంది. అధికారం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోని ఆ పార్టీ.. గౌరవప్రదమైన సీట్లు దక్కితే చాలు అన్నట్లుగా ఉంది.
అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు రావటం అసాధ్యమంటున్నారు. పేరుకు ముక్కోణ పోటీ అన్నట్లు ఉన్నా.. అసలు పోరు మాత్రం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీకి మధ్యనే ఉంటుందని చెబుతన్నారు. కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మాత్రం తాను ముఖ్యమంత్రి పదవిని చేపడతానని చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఎన్నికల వేడి పార్టీల మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా.. ఫలితాలు 8 తేదీన విడుదల కానున్నాయి. ఎన్నికల ప్రచారం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో..పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కు దిక్కులేదని.. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని బీజేపీ చేతికి వెళ్లకుండా ఉండేందుకు ఆమ్ ఆద్మీ సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. ఇలాంటివేళ.. కాంగ్రెస్ కు మరో ఘోర పరాభవం ఖాయమంటున్నారు. అంతిమ తీర్పు ఇవ్వాల్సిన ఓటర్లు ఏం చెబుతారన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.