Begin typing your search above and press return to search.

రైతు భరోసాకు కాంగ్రెస్ మంగళం పాడనుందా..? వాయిదాలు దేనికి సంకేతం..?

అలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ పథకాన్ని అమలు చేసింది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 11:30 PM GMT
రైతు భరోసాకు కాంగ్రెస్ మంగళం పాడనుందా..? వాయిదాలు దేనికి సంకేతం..?
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటి సారి కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ప్రభుత్వం కొలువుదీరింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. రైతుల కోసం రైతు భరోసా స్కీమ్‌ను ప్రకటించారు. ఈ పథకం ద్వారా రైతుకు రెండు సీజన్లలో పంటలకు ఎంతో కొంత ఆర్థిక చేదోడుగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏటా రెండు సీజన్లకు గాను ప్రతీ పంటకు రూ.5వేల చొప్పున సాయం ప్రకటించింది. అలా ఏటా రూ.10వేల చొప్పున అందించింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ పథకాన్ని అమలు చేసింది.

అయితే.. పది నెలల క్రితం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దాంతో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా కింద రైతులకు సాయం అందలేదు. ఎన్నికల ముంగిట రూ.పది వేల సాయానికి బదులు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ ప్రకటించారు. రైతు డిక్లరేషన్ సభలో ఈ మేరకు హామీ ఇచ్చారు. కానీ.. ఇంతవరకు ఒక దఫా సాయం కూడా రైతులకు చేరలేదు.

ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే.. కొత్త సర్కార్ కొలువుదీరి ఆరు నెలల దాక దానికి కూడా ముహూర్తంఫిక్స్ కాలేదు. ఇటీవలే రైతుబంధు పేరిట ఆ రుణాలను మాఫీ చేశారు. అయితే.. అవి కూడా రుణాలు తీసుకున్న అందరు రైతులకు కాలేదనేది పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు చెప్పిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు కూడా ఆమడ దూరం ఉంది. దాంతో మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన చేయాల్సి వచ్చింది. టెక్నికల్ సమస్య వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరణ ఇచ్చారు. దానిని సరిచేస్తున్నామని, త్వరలోనే అందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అవుతుందంటూ చెప్పుకొచ్చారు.

రైతుబంధు అలా ఉంటే.. రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరో కీలక ప్రకటన చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా సాయం ఇవ్వడంలేదని ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఒక్కసారిగా అసంతృప్తి కనిపించింది. మొన్నటి వరకు ఇస్తాం.. ఇస్తాం అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా చేతులెత్తేయడంతో వారిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. గత పదేళ్లుగా పొందుతున్న సాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడనుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్.. ఈ రైతు భరోసాను కూడా ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసి ధాన్యం కూడా చేతికి వచ్చిందని.. ఇలాంటి సమయంలో ఖరీఫ్ సాయం ఇవ్వడం లేదని సర్కార్ నుంచి ప్రకటించడంతో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి నిర్ణయాలు వినాల్సి వస్తుందా అన్న ఆందోళన చెందుతున్నారు.