రేవంత్ సార్... 100 రోజులు పోయి 300 రోజులు వచ్చాయి..?
అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలను ఇచ్చింది.
By: Tupaki Desk | 6 Nov 2024 9:30 AM'మేం అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రతీ హామీని అమలు చేసి చూపిస్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్’ ఇదీ.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు.
అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలను ఇచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే అందులో సగానికి సగం అమలుకు సాధ్యపడని హామీలే. కానీ.. తాము అధికారంలోకి వస్తే చూసేదిలే అని అనుకున్నారో ఏమో కానీ.. మొత్తానికి కాంగ్రెస్ హామీలను నమ్మిన ప్రజలు దానికే పట్టం కట్టారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరింది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 300 రోజులు అవుతోంది. కానీ.. ఇచ్చిన హామీల్లో కనీసం సగం కూడా అమలుకు నోచుకోలేదు. ఎంతో ఆర్భాటంగా చెప్పిన 6 గ్యారంటీలు ఇంకా ఎప్పటికి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకుంటాయో కూడా తెలియకుండా ఉంది. అడపాదడపా రెండు మూడు హామీలు తప్పితే ఇంకా చాలా వరకు అమలుకు నోచుకోక పెండింగులోనే ఉండిపోయాయి. దాంతో ఇప్పుడు ప్రజలు హామీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట తమ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు ప్రతినెలా రూ.2500, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రైతు భరోసా స్కీమ్ కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. చేయూత పథకం ద్వారా రూ.4వేల నెలవారీ పింఛన్, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతిమండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే.. గృహజ్యోతి ద్వారా ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
కానీ.. ఈ పథకాల్లో కేవలం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500 లకే సిలిండర్, ఆరోగ్యశ్రీ బీమా పథకాలు మాత్రమే ఇప్పటివరకు అమలు అవుతున్నాయి. అలాగే.. ప్రధానంగా ఏటా 2,00,000 జాబ్స్ భర్తీ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. కానీ.. ఆ హామీ కూడా ఇంకా అలానే ఉంది. 15,000 చొప్పున ఇస్తామన్న రైతు భరోసా రాలేదు. 4,000 పెన్షన్ ఇంకా ఇవ్వలేదు. 2,500 మహాలక్ష్మి పథకం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 6,000 దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడంలేదు. 15,000 కౌలు రైతులకు ఇవ్వలేదు. 12,000 రైతు కూలీలకు ఇవ్వడంలేదు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఇప్పటికి 300 రోజులు కావడంతో ఇంకా అమలు కావడం లేదు. దాంతో ఇప్పుడు ప్రజల్లో ఇదే చర్చ నడుస్తోంది.