హైడ్రా.. మూసీ అంటూ హడావుడి చేస్తే ఇలానే ఉంటాది రేవంత్!
అంతే తప్పించి.. రాత్రికి రాత్రి బొమ్మ మొత్తం మార్చేయటానికి ఇదేమీ సినిమా కాదన్న విషయాన్ని సీఎం రేవంత్ అండ్ కో మిస్ కావటం పెద్ద సమస్యగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 21 Oct 2024 4:37 AM GMTమంచి చేయాలనుకోవటం తప్పేం కాదు. వ్యవస్థల్ని మార్చాలనుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా స్వాగతించాల్సిందే. ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న తప్పుడు పద్దతుల్ని కరెక్టు చేయాలనుకోవటం మంచిదే అయినా.. దానికి పక్కా వ్యూహం అవసరం. అంతే కానీ.. హైడ్రా రంగనాథ్ మాదిరి హడావుడిగా.. లేడికి లేచిందే అన్న సామెతకు తగ్గట్లు వ్యవహరిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత.. గత ప్రభుత్వం అనుసరించిన సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తూ.. సెంటిమెంట్ ను బలోపేతం చేసుకుంటూ.. తప్పుడు విధానాల ప్రక్షాళనను చేపట్టాలి. అంతే తప్పించి.. రాత్రికి రాత్రి బొమ్మ మొత్తం మార్చేయటానికి ఇదేమీ సినిమా కాదన్న విషయాన్ని సీఎం రేవంత్ అండ్ కో మిస్ కావటం పెద్ద సమస్యగా చెబుతున్నారు.
2024 - 25 తొలి ఆర్నెల్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆశించిన ఆదాయానికి దగ్గర దగ్గర రూ.5వేల కోట్లు (మరింత సరిగ్గా చెప్పాలంటే రూ.4719 కోట్లు) తగ్గుదల రావటంతో సర్కారు షాక్ తిన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి వ్యవస్థలో ఏం చేయాలన్నా.. నిధులు అవసరం. అలాంటిది కొత్తగా ఆదాయ మార్గాల్నిపెంచకున్నా.. ఎప్పటిలా వచ్చే ఆదాయాలు తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో రేవంత్ కాస్త తొందరపాటుతో వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది.
ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో నిర్దేశించిన లక్ష్యం రూ.42,034 కోట్లు కాగా అందులో రూ.4719 కోట్ల మేర తగ్గటాన్నిప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఆదాయం ఎందుకు తగ్తుతోంది? ఇతర రాష్ట్రాల మాదిరి ఎందుకు పెంచలేకపోతున్నామనే అధ్యనం చేసి చెప్పాలని ప్రభుత్వ శాఖలను తాజాగా ఆదేశించింది. నిజానికి రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత అప్పటికే స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపు తేవటానికి పెద్దగా ప్రయత్నాలు ఏమీ చేయలేదు.
ఇది సరిపోదన్నట్లు ఫోర్తు సిటీ అంటూ కొత్త కన్ఫ్యూజన్ షురూ చేశారు. మరోవైపు హైడ్రా పేరుతో చెరువుల ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ఒక ఉద్యమంలా చేశారు. అప్పటికే వివిధ శాఖల నుంచి అనుమతులు పొందిన తర్వాత నిర్మాణం చేపట్టిన కట్టడాల్ని సైతం కూల్చేయటం.. ఇందులో మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతితో పాటు.. అల్పాదాయ వర్గాలు తీవ్రంగా ప్రభావితం కావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. క్రమపద్దతిలో కాకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ.. ఎలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో.. ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది.
ఈ క్రమంలో అప్పటికే మందగమనంలో ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత నెమ్మదించింది. హైదరాబాద్ కు ఐటీ ఉత్పత్తులు.. ఐటీ సేవలు ఎంత ముఖ్యమో.. రియల్ ఎస్టేట్ కూడా అంతే ముఖ్యం. ఎప్పుడైతే కండీషన్లు పెట్టి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవటం మొదలు పెట్టారో.. సెంటిమెంట్ దెబ్బ తిన్న పరిస్థితి. దీంతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టటంతో పాటు.. నిర్మాణ రంగం సైతం నెమ్మదించినట్లుగా చెప్పాలి. ఈ ఎఫెక్టు మొత్తం ప్రభుత్వ ఆదాయం మీద పడింది.
ఆర్నెల్ల వ్యవధిలో అనుకున్న లక్ష్యానికి రూ.4719 కోట్లు తగ్గటమంటే.. నెలకు రూ.800 కోట్ల (సుమారు) మేర తగ్గినట్లుగా చెప్పాలి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విభాగాల వారీగా సమీక్ష జరిపినప్పుడు మద్యం అమ్మకాలపై పెట్టుకున్న లక్ష్యానికి మించి ఆదాయం రాగా.. జీఎస్టీ.. పెట్రోలియంపై అమ్మకపు పన్ను.. వ్రత్తి పన్నులాంటి ఆదాయాల్లోనూ లక్ష్యాల కంటే తక్కువగా నమోదైనట్లుగా తేలింది. జీఎస్టీ లక్ష్యం భారీగా తగ్గటంతో అందుకు కారణం ఏమటన్న విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. మొదటి అర్థభాగం లోటు.. తర్వాతి ఆర్నెల్ల కాలంలో పూడ్చుకోవటంతో పాటు.. లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయం ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాల మీదా.. ఆయా రంగాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.