Begin typing your search above and press return to search.

హైడ్రా.. ఇక‌, అంకుశ‌మే: ఆరు వారాల్లో చ‌ట్టం!

అనంత‌రం.. జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో దీనిని చ‌ట్టం చేయ‌నున్నారు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 1:30 AM GMT
హైడ్రా.. ఇక‌, అంకుశ‌మే:  ఆరు వారాల్లో చ‌ట్టం!
X

హైద‌రాబాద్‌లోని ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చి వేస్తూ.. సంచ‌ల‌నం సృష్టిస్తున్న 'హైడ్రా' ఇక‌పై మ‌రింత దూకుడుగా వ్య‌వ హ‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎందుకంటే.. దీనిని చ‌ట్టబ‌ద్దం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న కేబినెట్ స‌మావేశంలో హైడ్రాకు సంబంధించిన ముసాయిదా చ‌ట్టానికి ఆమోదం తెల‌ప‌నున్నారు. అనంత‌రం.. జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో దీనిని చ‌ట్టం చేయ‌నున్నారు. దీంతో మ‌రింత బ‌లంగా హైడ్రా ప‌నిచేయ‌నుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే.. హైడ్రా దూకుడు పెంచ‌డంతో అనేక మంది చేసిన‌ ఆక్ర‌మ‌ణ‌లు కుప్ప‌కూలిపోయా యి. దీంతో ప‌లువురు హైకోర్టుకు ఎక్కిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లోనే హైడ్రా చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై ప్ర‌శ్న‌లు తెరమీదికి వ‌చ్చాయి. అయితే.. అప్ప‌ట్లోనే స‌ర్కారు వివ‌ర‌ణ ఇస్తూ.. జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపింది. అయితే.. చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై మాత్రం ఇంకా ప్ర‌శ్న‌లు మిగిలే ఉన్నాయి. అయితే.. స‌ర్కారు మాత్రం హైడ్రాను చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌దేన‌ని చెబుతోంది.

ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. సో.. దీనికి ప‌వ‌ర్స్ ఉన్నాయ‌న్న‌ది అధికారుల వాద‌న‌. అయినా.. కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు స‌ర్కారు ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా చ‌ట్టాన్ని ఈ నెల‌లోనే మంత్రివ‌ర్గం ఆమోదించనుంది. అనంత‌రం.. అసెంబ్లీలోనూ ప్ర‌వేశ పెట్టి ఆమోద ముద్ర వేయించ‌నుంది. దీంతో వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు హైడ్రాకు ద‌ఖ‌లు ప‌డ‌నున్నాయి.

ఇక‌, గ‌త శ‌నివారం, ఆదివారం హైడ్రా సంచ‌లనం సృష్టించిన విష‌యం తెలిసిందే. న‌గ‌ర శివారు ప్రాంతాల్లోని అనే క ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే.. ఈ సారి మాత్రం అవేవీ లేకుండానే.. శ‌నివారం గ‌డిచిపోయింది. మ‌రి ఆదివారం ఏమైనా.. సంచ‌ల‌నాలు ఉంటాయేమో చూడాలి. ఇదిలావుంటే.. వారాంతాల్లోనే కూల్చివేత‌లు చేప‌డుతుండ‌డం ప‌ట్ల హైడ్రాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.