Begin typing your search above and press return to search.

హైడ్రా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తుందా..?

అంత పెద్ద స్థాయిలో నిర్మించిన ఫిల్మ్ సిటీపై ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 Sep 2024 5:39 AM GMT
హైడ్రా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తుందా..?
X

రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్‌కే తలమానికం. రామోజీ గ్రూప్ ఆఫ్స్ చైర్మన్ రామోజీరావు ఫ్యూచర్ విజన్‌తో దానిని నిర్మించారు. 2,000 ఎకరాల్లో నిర్మించిన ఈ ఫిల్మ్ సిటీలో ఏకకాలంలో 15 సినిమా షూటింగులు తీయొచ్చు. ఇందులో 6 హోటళ్లు, 47 సౌండ్ స్టేజీలు, రైల్వే స్టేషన్ల నుంచి దేవాలయాల వరకూ పర్మినెంట్ సెట్లు ఉన్నాయి. అటు పర్యాటకంగానూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. అంత పెద్ద స్థాయిలో నిర్మించిన ఫిల్మ్ సిటీపై ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి.

2,000 ఎకరాల్లో నిర్మించిన ఫిల్మ్ సిటీ మీద తెలంగాణ ఉద్యమ సమయంలో రక రకాల ఆరోపణలు చేసారు. గతంలో కేసీఆర్ అధికారంలోకి రాకముందు వెయ్యి నాగళ్లు పెట్టి ఫిల్మ్ సిటీని దున్నేస్తాం అంటూ భారీ ప్రకటనలు సైతం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారు అది వేరే విషయం అనుకోండి.

అయితే.. ఇప్పుడు ఈ అంశం మరోసారి తెరమీదకు వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, దాని చుట్టుపక్కల చెరువులను ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. చిన్నా పెద్దా.. పొలిటికల్ అని తేడా లేకుండా హైడ్రా తన పని తాను చేస్తూ పోతోంది. ఏకంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సైతం ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని నిర్ధారించిన హైడ్రా.. నేలమట్టం చేసేసింది. దాంతోపాటే చాలా మంది పొలిటికల్ లీడర్ల ఫౌమ్‌హౌజ్‌లపై కన్నేసింది. వాటి వివరాలు తీస్తోంది. అవి కూడా అక్రమ నిర్మాణాలే అని తేలితే వాటిని కూడా కూల్చేందుకు సిద్ధమవుతోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. రామోజీ ఫిల్మ్ సిటీ వైపు హైడ్రా వెళ్తుందా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ పై తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ పలు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో లక్ష నాగళ్లతో దున్ని పేదల భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన వారు ఇంకా వారికి ఎక్కువ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. అస్తిత్వం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలోనూ వారికే దాసోహం అయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. ఫిల్మ్ సిటీ నిర్మాణంలో నాలుగు గ్రామాలు పోయాయని, ఎఫ్‌టీఎల్ కింద ఫిల్మ్ సిటీ నిర్మాణం జరిగిందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఫిల్మ్ సిటీలో మూడు పెద్ద చెరువులు ఉన్నాయని ఆరోపించారు. పెద్దాసాగర్, ఇంద్రాసాగర్‌తో పాటు కుంటలు కూడా చాలా వరకు ఉన్నాయని ఆరోపించారు. కొన్ని కాలువలను కబ్జా చేసి ఇల్లు నిర్మించారని, దాని పక్కన నాలా పోయేలా 18 ఫీట్లతో వాల్ కట్టారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ అక్కడి వరకు కూడా పోవాలని తాజాగా జర్నలిస్ట్ రఘు యూట్యూబ్ చానెల్ లో ఓ కార్మిక నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఫామ్‌హౌజ్‌ల దగ్గర బయట ఎలా అయితే టేపులు పెట్టి కొలుస్తున్నారో.. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి పోయి కొలతలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చాలని అంటున్నారు.

ఈ కార్మిక నేత చేసిన డిమాండ్ వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి గెలవగానే రామోజీరావు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిని అక్కున చేర్చుకున్నారు. గెలిపించిన వీరి మీదకు బుల్డోజర్ వేసుకొని వెళతాడా. ? లేదా అన్నది ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తున్న ప్రశ్న.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.