Begin typing your search above and press return to search.

'ఇండియా' కుప్ప‌కూల‌డం ఖాయ‌మే!!

దీనికి కార‌ణం బీజేపీ కాదు.. కాంగ్రెస్ అనుస‌రించిన ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే. ఆప్ స‌హా.. ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని పోవ‌డంలో కాంగ్రెస్ వ్యూహం వేయ‌లేదు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:30 PM GMT
ఇండియా కుప్ప‌కూల‌డం ఖాయ‌మే!!
X

ఇండియా.. కాంగ్రెస్ నేతృత్వంలో సుమారు 13 పార్టీలు క‌లిసి ఏర్పాటు చేసుకున్న అతి పెద్ద కూట‌మి. ఎన్నో పార్టీలు.. విభిన్న ఆలోచ‌న‌లు. అయినా.. ఒకే ల‌క్ష్యం. అదే మోడీని ఎదిరించి.. ఆయ‌న‌ను గ‌ద్దె దింపి.. కేంద్రంలో పాగా వేయ‌డం. అయినా.. ఈ కూట‌మి ల‌క్ష్యం చేర‌లేదు. దీనికి కార‌ణం.. కాంగ్రెస్ పార్టీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరేన‌ని అంటున్నారు. ఈ కార‌ణంగానే హ‌రియాణాను చేజేతులా పోగొట్టుకు న్నార‌న్న వాద‌న కూడా ఉంది.

హ‌రియాణాలో బీజేపీ వ‌రుస‌గా రెండు సార్లు అధికారం చ‌లాయించింది. ఇక‌, మూడో సారి (ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌లు) ఆ పార్టీకి పెద్ద అగ్ని ప‌రీక్ష‌గామారాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అన్ని స‌ర్వేలూ.. బీజేపీకి ఎదురీతేన‌ని చెప్పాయి. అధికారం ద‌క్క‌ద‌ని తేల్చాయి. అయినా.. బీజేపీ వ‌రుస‌గా మూడోసారి విజ‌యం ద‌క్కించుకుంది. దీనికి కార‌ణం బీజేపీ కాదు.. కాంగ్రెస్ అనుస‌రించిన ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే. ఆప్ స‌హా.. ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని పోవ‌డంలో కాంగ్రెస్ వ్యూహం వేయ‌లేదు.

దీంతో అధికార పార్టీ బీజేపీ వ్య‌తిరేక ఓటుబ్యాంకు చీలిపోయి.. కాంగ్రెస్‌ను తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచింది. క‌ట్ చేస్తే.. ఈ ఓట‌మి త‌ర్వాతైనా.. కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకుంటుంద‌ని.. ఇండియా కూట‌మి పార్టీల‌ను క‌లుపుకొని వెళ్తుంద‌ని ఆశించారు. కానీ, ఆ పార్టీలో ఎక్క‌డా మార్పు రావ‌డం లేదు.దీంతో ఇండియా కూట‌మిలో కాంగ్రెస్ పై నానాటికీ విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లుతోంది. వ‌చ్చే ఏడాది కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇక్క‌డ బీజేపీ పుంజుకునేందుకు పావులు క‌దుపుతోంది.

దీనిని అడ్డు కోవాలంటే.. ఇక్క‌డ అధికార ప‌క్షంగాఉన్న సీపీఐ నేతృత్వంలోని కూట‌మితో క‌లిసి కాంగ్రెస్ ముందుకు సాగాలి. కానీ, అలా చేయ‌డం లేదు. వ‌య‌నాడ్ పార్ల‌మెంటు స్థానంలో ఉప ఎన్నిక వ‌చ్చిన నేప‌థ్యంలో ఇప్పుడైనా ఈ సీటును తమ‌కు ఇవ్వాల‌న్న సీపీఐ అభ్య‌ర్థ‌న‌ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇక్క‌డ నుంచి త‌మ గారాల‌ప‌ట్టి.. సోనియా కుమార్తె.. ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతున్నారు. కానీ, ఇలా చేయ‌డాన్ని సీపీఐ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.

దీంతో ఇండియా కూట‌మిపైనే ప్ర‌భావం చూప‌నుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనే వ‌య‌నాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్‌గాంధీ.. రెండు ప‌ద‌వ‌ల‌పై కాళ్లేశారు. యూపీలోని రాయ్‌బ‌రేలి(సోనియా నియోజ‌క‌వ‌ర్గం) నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా ఆయ‌న పోటీ చేశారు. ఈ క్ర‌మంలోనే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి రాజా స‌తీమ‌ణి 'అన్నీ రాజా' ఇక్క‌డ పోటీ చేయాల‌ని త‌ల‌పోశారు. కూట‌మిలో భాగంగా త‌మ‌కు వ‌దిలి పెట్టాల‌న్నారు. కానీ, రాహుల్ స‌సేమిరా అన్నారు.

దీంతో అన్నీరాజా.. సీపీఐ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఎలానూ రాహుల్ వ‌య‌నాడ్‌ను వ‌దులుకున్నారు కాబ‌ట్టి..ఈ సీటును త‌మ‌కు ఇవ్వాల‌న్న‌ది వారి డిమాండ్‌. కానీ, దీనికి కూడా కాంగ్రెస్ అడ్డు చెబుతోంది. ఈప‌రిణామాల క్ర‌మంలో కేర‌ళ‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై ఆలోచ‌న చేస్తామ‌ని క‌మ్యూనిస్టులు ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.