Begin typing your search above and press return to search.

'చిన్నమ్మ'కు ఉద్వాసన తప్పదా?

ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 2:30 PM GMT
చిన్నమ్మకు ఉద్వాసన తప్పదా?
X

ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ అధిష్టానం ఉద్వాసన పలకనుందని టాక్‌ నడుస్తోంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.

ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదరడంలో పురందేశ్వరి సైతం కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇటీవల ఎన్డీయే శాసనసభ్యుల సమావేశంలో వెల్లడించారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా లేకుంటే ఈ పొత్తు సాధ్యపడేది కాదన్నారు.

కాగా బీజేపీ ఎంపీగా గెలుపొందాక కేంద్రంలో తనకు మంత్రి పదవి ఖాయమని పురందేశ్వరి లెక్కలు వేసుకున్నారు. గతంలో యూపీయే ప్రభుత్వ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో పురందేశ్వరి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తాను కేంద్ర మంత్రిని కావడం ఖాయమని భావించారు.

అయితే తానొకటి తలిస్తే.. అధిష్టానం ఒకటి తలచినట్టు బీజేపీ అధిష్టానం నర్సాపురం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. దీంతో ఆశ్చర్యపోవడం పురందేశ్వరి వంతైంది.

మరోవైపు పురందేశ్వరి బీజేపీని రాష్ట్రంలో బలపడనివ్వడం లేదని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మొదటి నుంచి ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికి కాకుండా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకే సీట్లు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తన సామాజికవర్గానికి చెందినవారికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి ఆమెపై పార్టీ అధిష్టానానికి కూడా కొందరు నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీ సంస్థాగతంగా బలపడాలంటే పురందేశ్వరిని అధ్యక్షురాలిగా తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఆమెను అధ్యక్షురాలిగా తప్పిస్తారని టాక్‌ నడుస్తోంది.

పురందేశ్వరి స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తారని చెబుతున్నారు. ఆయన ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట లోక్‌ సభా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్లారి కిరణ్‌ పై వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో అక్టోబర్‌ లో పురందేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా తప్పించొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ బాధ్యతలను కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ మేరకు బీజేపీ అధిష్టానం కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చర్చించిందని పేర్కొంటున్నారు.