Begin typing your search above and press return to search.

జగన్ ధైర్యానికి ఇది ఒక పరీక్ష!

అప్పటికి మూడు నెలల ఎంపీగా ఉన్న జగన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎదిరించారు.

By:  Tupaki Desk   |   10 Nov 2024 3:50 AM GMT
జగన్ ధైర్యానికి ఇది ఒక పరీక్ష!
X

వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు సీఎం గా పనిచేశారు. 2009లో తన తండ్రి వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే మరణించారు. అప్పటికి మూడు నెలల ఎంపీగా ఉన్న జగన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎదిరించారు.

ఆ మెదట సొంత పార్టీ పెట్టారు. అక్కడ నుంచి పదేళ్ళ పాటు పోరాటం చేసి సీఎం అయ్యారు. అటువంటి జగన్ కి ధైర్యం లేదని అనుకోగలమా అని అంటున్నారు. అయితే సీఎం అయిన తరువాత జగన్ జనంలోకి పెద్దగా రాలేదని, క్యాడర్ తో గ్యాప్ పెరిగిందని కూడా అంటూంటారు.

ఈ క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను బేరీజు వేసిన వారు గత జగన్ కి ఇప్పటి జగన్ కి మధ్య తేడా ఉందని కూడా విశ్లేషిస్తారు. ఈ క్రమంలో జగన్ కి ధైర్యం లేదని విమర్శలూ ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా ఉన్న షర్మిల అయితే అసెంబ్లీకి వెళ్లడానికి భయమెందుకు అని వైసీపీని ప్రశ్నించారు.

ఇపుడు హోం మంత్రి అనిత అయితే జగన్ కి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. దీంతో జగన్ డేరింగ్ కే అంతా పరీక్ష పెడుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఇంతకీ జగన్ అసెంబ్లీకి రావడానికి ధైర్యం అవసరమా అంటే ఆయన పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే సభలో అడుగు పెట్టాలి.స్పీకర్ అనుమతితోనే ఆయనకు మైకు వస్తుంది.

అదే విపక్ష నేతగా గుర్తింపు ఉంటే ఆయన చేయి ఎత్తగానే మైక్ ఇస్తారు. ప్రోటోకాల్ ఉంటుంది. ఇపుడు చూస్తే సభలో 164 మంది ఎమ్మెల్యేలు కూటమిగా ఒక వైపు ఉంటారు. అతి చిన్న నంబర్ తో వైసీపీ విపక్షంలో ఉండాలి. వారికి విపక్షంలో మొదటి వరసలో సీట్లు ఇస్తారా లేక వెనకాల కేటాయిస్తారా అన్నది కూడా తెలియదు.

గత అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా అపరిమితమైన అధికారాలను చలాయించిన జగన్ కి ఇది నిజంగా చేదుగానే ఉంటుంది. పైగా కూటమి నుంచి ప్రతీ వారూ విమర్శలు చేస్తారు. జగన్ లేకుండానే ప్రతీ దానికీ జగన్ ప్రభుత్వమే కారణం అంటూ గత అయిదు నెలలుగా మీడియా ముఖంగానూ అలాగే పబ్లిక్ మీటింగులలోనూ ఆరోపణలు చేస్తున్న కూటమి పెద్దలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్ విపక్షంలో కనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా అన్నది కూడా మరో చర్చ.

ఇక అసెంబ్లీలో వైసీపీని గొంతు ఎత్తకుండా చేసి అనాల్సినవి అన్నీ అంటారని కూడా అంచనాలు అయితే ఉన్నాయి. దాంతో అసెంబ్లీకి వెళ్తే అవమానమే అని తలచే వైసీపీ వెళ్లడం లేదు అన్న ప్రచారం ఉంది. దానికే భయం అన్న పేరు పెట్టి ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో ఉండాలని హోం మంత్రి అనిత చేసిన సవాల్ కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. అంతే కాదు సభకు రాని వారికి ఓటేయడం ఎందుకు అన్నది ప్రజలు కూడా ఆలోచించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి కూడా టీడీపీ విజయం మొదలవుతుందని ఆమె అనడమూ విశేషం. ఇవన్నీ ఆలోచించినపుడు జగన్ లో ధైర్యం లేదా అందుకేనా సభకు రావడం లేదు అన్న ప్రత్యర్థి పార్టీల మాటలే జనంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దాంతో వైసీపీకి సభకు వెళ్తే ఒక బాధ లేకపోతే మరో తంటా అన్నట్లుగా ఉందని అంటున్నారు.

దాంతో జగన్ ఈసారి అసెంబ్లీని బహిష్కరించడం వెనక వ్యూహాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. జగన్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటికల్ లీడర్ అన్నది ఆయనకు మొదటి నుంచి ఉన్న ట్యాగ్. మరి దానికి పదును పెట్టాలీ అంటే ఆయన కచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే అని అంటున్నారు.

అసెంబ్లీలో జగన్ ఉంటే కనుక టీడీపీ నుంచి విమర్శలు వచ్చినా ధీటుగా బదులు చెప్పవచ్చునని ఒకవేళ కార్నర్ చేస్తే వారి మీదనే నెపం నెట్టి అపుడు అసెంబ్లీ మీద బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించవచ్చు అని అంటున్నారు. సో జగన్ అసెంబ్లీకి వచ్చే విషయంలో ఇపుడు ధైర్యం అన్నది ఒక పెద్ద ఎలిమెంట్ గా మారుతోంది. అలా ప్రత్యర్ధులు సవాల్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.