కోర్టులో జగన్ పిటిషన్... ఆసక్తికరంగా సీబీఐ నిర్ణయం!
దీంతో.. వీటినుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు కోరాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 3 Jan 2025 5:02 PM GMTవైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో బెయిల్ పొందిన ఆయనకు కోర్టు కొన్ని షరతులు పెట్టింది. దీంతో.. వీటినుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు కోరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టును ఆశ్రయించారు.
అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. గతంలో తనపై కోర్టు పెట్టిన షరతుల్లో ఓ విషయంలో కోర్టు ఉత్తర్వ్యుల్లో మినహాయింపు కోరుతూ శుక్రవారం నాడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం... ఆయన విదేశాలకు వెళ్లనుండటమే.
జగన్ కుమార్తె లండన్ లో చదువుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో జగన్ దంపతులు యూకే వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారట. ఇందులో భాగంగా... ఈ నెల 11 నుంచి 15 వరకూ భార్య భారతితో కలిసి జగన్ విదేశీ పర్యటన చేపట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించాలని.. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో... సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. జగన్ విదేశీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తుందా.. లేక, గతంలో మాదిరిగానే జరిగే అవకాశం ఉందా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ జగన్ విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బెయిల్ షరతుల్ని సడలించింది! మరోపక్క జగన్ అక్రమాస్తుల కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చింది. అయితే.. అధికారంలో లేకపోవడంతో సీబీఐ నిర్ణయం ఆసక్తిగా మారిందని అంటున్నారు.