జగన్ యూకే టూర్.. సీబీఐ, హైకోర్టుల్లో కీలక పరిణామాలు!
ఈ సమయంలో రెండు కోర్టుల్లోనూ జగన్ కు గుడ్ న్యూస్ లు వినిపించాయి!
By: Tupaki Desk | 9 Jan 2025 8:04 AM GMTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) వెళ్లేందుకు హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్.. పాస్ పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్.ఓ.సీ) పొందేందుకు ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు కోర్టుల్లోనూ జగన్ కు గుడ్ న్యూస్ లు వినిపించాయి!
అవును... ఈ నెల 11 నుంచి రెండు వారాల పాటూ విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో జగన్ పిటిషన్ ను విచారించిన సీబీఐ కోర్టు.. ఈ నెల 11 నుంచి 30 వరకూ ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. తన కుమర్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ యూకే వెళ్తున్నారు!
మరోపక్క జగన్ తాజా పాస్ పోర్ట్ పొందేందుకు అవసరమైన నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను జారీ చేస్తూ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... ఐదేళ్ల కాల వ్యవధితో జగన్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తన కుమర్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమం నిమిత్తం జగన్ యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
వాస్తవానికి.. జగన్ కు ఐదేళ్ల కాల వ్యవధితో పాస్ పోర్టు జారీకి ఎన్.వో.సీ. ఇవ్వాలంటే ఆయన స్వయంగా కోర్టు ముందు హాజరవ్వాలని, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తన నిర్ణయాన్ని వెలువరించారు. ఇందులో భాగంగా... ఎన్వోసీ జారీ చేయాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలేవీ చెల్లవని.. అందువల్ల ప్రత్యేక కోర్టు ఉత్తర్వ్యులను రద్దు చేస్తున్నామని తీర్పులో పేర్కొన్నట్లు తెలుస్తోంది! దీంతో... ఈ నెల 11న జగన్ యూకే టూరుకు లైన్ క్లియర్ అయినట్లే నని అంటున్నారు.