జగన్ ఇంట గెలవాల్సిందే...లేకపోతే రచ్చ రచ్చే ?
ప్రజలు కూడా ఈ రోజు ఓట్లు వేసే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
By: Tupaki Desk | 9 March 2025 4:00 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం అన్నీ తన కోణం నుంచే ఆలోచిస్తారు అని అంటూంటారు. రాజకీయాలు అంటే జనం కోణం నుంచి ఆలోచనలు చేయాలి. రాజకీయాల్లోకి వచ్చాక అక్కడికి తగినట్లుగా ఆట ఆడాలి. కాదూ కూడదు అంటే ఇబ్బందులే ఎదురవుతాయి. ప్రజలు కూడా ఈ రోజు ఓట్లు వేసే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల వారిని మెప్పించేలాగానే నాయకులు రాజకీయం చేయాల్సి ఉంటుంది.
వైసీపీ అధినేత జగన్ విషయం తీసుకుంటే ఆయన ముక్కు సూటిగా ఉంటారు. అలాగే ఆలోచిస్తారు. జనాలు కూడా నిజాలు తెలుసు కాబట్టి నమ్ముతారు అని అనుకుంటారు. కానీ జనాలు అవేమీ చూడరు. అంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించరు. ఇక అందరూ ఎలా ఉంటారో అలాగే వైసీపీ నేతలూ ఉండాలని అనుకుంటారు.
జగన్ విషయం తీసుకుంటే ఆయన తన తల్లి విజయమ్మ మీద చెల్లెలు షర్మిల మీద కోర్టులో కేసు వేశారు. ఆయన వైపు న్యాయం ఉందని నమ్మవచ్చు. కానీ జనాల వద్దకు వచ్చేసరికి అది సున్నితమైన అంశం అవుతుంది. అంతే కాదు వారు దాని మీదనే ఆలోచిస్తారు. ఇక ప్రత్యర్ధులు సైతం ఆజ్యం పోస్తారు. 2024 ఎన్నికలు పెట్టిన మంట ఒక వైపు ఉండనే ఉంది. చెల్లెలు ఎదురు నిలిచి చేసిన విమర్శలు జనంలోకి బాగా వెళ్ళాయి. అందుకే రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ అయినా అక్కడా సీట్లూ రాలేదు. ఆఖరికి విపక్ష హోదా కూడా తగ్గలేదు.
అందువల్ల ఈ విషయంలో జగన్ ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ప్రతీ కుటుంబంలో వివాదాలు ఉంటాయని వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అంటున్నారు. లేకపోతే ఇంట వారికే న్యాయం చేయలేదు మాకేమిటి చేస్తారు అని జనాలు అనుకునే ప్రమాదం కూడా ఉంది. విపక్షాలూ దాన్ని మరింతగా ఎగదోస్తాయి.
మరో విషయం ఏంటి అంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయం కూడా జగన్ ని ఇబ్బంది పెడుతోంది. దీని వల్ల కూడా 2024 ఎన్నికల్లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మరో చెల్లెలు సునీత బయటకు వచ్చి చేసిన ప్రచార ప్రభావమూ బాగానే కనిపించింది.
ఇలా ఇంటి సమస్యలు జగన్ కి చాలానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ఓటమి తరువాత పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది. దాంతో పాటు వైఎస్సార్ కుటుంబంతోనూ వివాదాలు లేకుండా చూసుకోవడం అంతా ఒక్కటి అన్నది జనాలకు కనిపించేలా చేయడం ముఖ్యమని అంటున్నారు. అలా ఇంట గెలిచిన తరువాతనే రచ్చ గెలవడం జరుగుతుంది అని అంటున్నారు. లేకపోతే రచ్చ రచ్చే అవుతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేతను సమస్యలు అన్నీ కలసి చుట్టుముడుతున్నాయి. వాటికి పరిష్కారం కనుగొనకుండా ప్రత్యర్ధులను ఎదిరించడం వారి మీద నెగ్గడం అంత సులువు అయిన విషయం కానే కాదని అంటున్నారు.