కోటా పెంచాలయ్యా సామీ...జనసైన్యం మాట?
ఆయన లేకపోతే ఆ ఎన్నికల ఫలితాలు వేరేగా ఉంటాయని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం నమ్ముతారు.
By: Tupaki Desk | 11 Nov 2024 9:30 PM GMTజనసేనాని పవన్ అయితే ఆయనను అనుసరించి అభిమానించే అపరిమితమైన జనమంతా సైన్యమే. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో అత్యంత కీలకమైన నేతగా నిలిచారు. మొత్తం ఈ ఎన్నికల్లో ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అన్నారు. ఆయన లేకపోతే ఆ ఎన్నికల ఫలితాలు వేరేగా ఉంటాయని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం నమ్ముతారు.
ఇదిలా ఉంటే జనసేనకు పొత్తులో భాగంగా 21 సీట్లను కేటాయించారు. 21కి 21 సీట్లను జనసేన గెలిచి చూపించింది. అయితే ఆనాడే ఎక్కువ సీట్లు తీసుకోవాలని జనసైనికుల నుంచి విన్నపాలు వచ్చాయి. దానికి జనసేన అధినాయకత్వం చెప్పినది ఏంటి అంటే ముందు అధికారంలోకి రావాలని. ఆ మీదట లభించే నామినేటెడ్ పదవులు ఇతరత్రా వాటిలో ఎక్కువగా జనసేన తీసుకోవచ్చు అని.
ఆనాడు కూటమి బలంగా నిలబడడం, వైసీపీ ఓటమి ముఖ్యమని జనసేనాని చెప్పడంతో జనసైనికులు కూడా అంగీకరించారు. మొత్తానికి బ్రహ్మాండమైన మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక జనసేనలోని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల మీద ఫోకస్ పెట్టారు.
అయితే ఇప్పటిదాకా మొత్తం 80 దాకా కార్పోరేషన్ల చైర్మన్ పోస్టులను భర్తీ చేస్తే అందులో టీడీపీకి 63, బీజేపీకి నాలుగు, జనసేనకు 13 దక్కాయని అంటున్నారు. ఇదంతా కూడా జనసేన ఎన్నికల్లో సాధించిన 21 సీట్లను నిష్పత్తిగా తీసుకునే భర్తీ చేస్తున్నారు అని అంటున్నారు.
నిజానికి మంత్రి పదవుల విషయంలోనూ అలాగే జరిగింది అని అంటున్నారు. ప్రతీ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అన్న నిష్పత్తిలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. ఇపుడు కూడా జనసేనకు 13 నామినేటెడ్ పదవులే దక్కాయి. మరో ఇరవై కార్పొరేషన్లకు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
అందులో కూడా మరో మూడో నాలుగో దక్కుతాయని అంటున్నారు. దీంతో జనసైనికులలో అసంతృప్తి రాజుకుంటోంది అని అంటున్నారు. నిజానికి జనసేనకు 2024 ఎన్నికల్లో పోటీ చేసే కెపాసిటీ ఉండి గెలిచే వీలుండి కూడా పొత్తులలో భాగంగా సీట్లను తగ్గించుకుందని గుర్తు చేస్తున్నారు.
జనసేనకు కేవలం 21 సీట్లకే పరిమితం అయిన పార్టీగా తగ్గించడం వల్లనే నామినేటెడ్ పదవుల విషయంలో తేడా వస్తోందని అంటున్నారు. ఎటూ ఏపీలో అధికారంలో సింహ భాగం టీడీపీకే ఉందని నామినేటెడ్ పదవుల విషయంలో అయినా జనసేనకు కనీసం 30 నుంచి 40 పెర్సెంట్ పదవులు ఇస్తే బాగుండేది అని అంటున్నారు.
పైగా జమిలి ఎన్నికలు మరో రెండున్నరేళ్ల వ్యవధిలో వస్తాయని అంటున్నారని జనసేన ఇపుడు మరింత కీలకం కానుందని అందువల్ల గట్టిగా కోరితే తప్పకుండా జనసేన వాటా కింద ఎక్కువ నామినేటెడ్ పదవులే వచ్చేవని అంటున్నారు.
ప్రస్తుతం జనసేన తీసుకున్న పదవులు చూస్తే ఆశావహులలో నాలుగవ వంతు కూడా సరిపోవని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడే పార్టీని పటిష్టం చేసుకోవాల్ని పార్టీలో ఎక్కువ మందికి నామినేటెడ్ పదవులు దక్కితే రానున్న రోజులలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అంటున్నారు. మూడవ విడతలో అయినా ఎక్కువ పోస్టులు తీసుకోవాలని సూచనలు వస్తున్నాయట. మరి జనసైనికులకు ఈసారి అయినా పూర్తి స్థాయిలో మంచి పొజిషన్ తో కూడిన పదవులు దక్కుతాయా అంటే వేచి చూడాల్సి ఉంది అంటున్నారు.