కాపులకు రిజర్వేషన్ దక్కేనా ?
కాపు ఉద్యమ నాయకులు అయితే అరవై దశకం దాకా తమకు రిజర్వేషన్లు ఉన్నాయని చెబుతారు.
By: Tupaki Desk | 5 Dec 2024 9:30 PM GMTకాపులు ఏపీలో అతి పెద్ద సామాజిక వర్గం. వారి ప్రమేయం లేకుండా ఏపీలో రాజకీయం సాగదు. అంతే కాదు ఏ పార్టీ ఓడాలన్నా గెలవాలన్నా వారు పోషించే పాత్ర అత్యంత కీలకం. అటువంటి కాపులకు చిరకాల డిమాండ్ గా ఉంది. అయితే అది అలా ఆగుతూ బ్రేకులు పడుతూనే ఉంది.
కాపు ఉద్యమ నాయకులు అయితే అరవై దశకం దాకా తమకు రిజర్వేషన్లు ఉన్నాయని చెబుతారు. కాపులను బీసీ కేటగిరిలో చేర్చాలని మొదటిగా ఉద్యమించింది ముద్రగడ పద్మనాభం. ఆయన ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితమే ఆ నినాదం అందుకున్నారు.
ఇక 2014 లో చంద్రబాబు విభజన ఏపీకి సీఎం అయ్యాక ఈ రిజర్వేషన్ డిమాండ్ ఊపందుకుంది. ముద్రగడ ఈ నినాదంతోనే నాటి ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేశారు. అయితే కాపులను బీసీలలో చేర్చేందుకు సాంకేతికపరమైన ఆటంకాలు ఉండడంతో నాటి ప్రభుత్వం అప్పట్లో కేంద్రం తీసుకుని వచ్చిన ఈడబ్ల్యూ ఎస్ కేటగిరిలో వారికి అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మొత్తం పది శాతం ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లలో అగ్ర కులాలు అందరూ వస్తారు. అందులో సగం వాటా కాపులకు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరగలేదు. ఇక మళ్లీ చంద్రబాబు 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చారు.
ఇపుడు ఆ రిజర్వేషన్ల కింద కాపులకు అయిదు శాతం వాటా కావాలని కోరుతూ మాజీ మంత్రి హరి రామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిందని గతంలో ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ అయిదు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాలని జోగయ్య తన పిటిషన్ లో కోరారు.
అయితే అయిదు శాతం కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇవ్వవద్దని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా ఇంకో వైపు దాఖలు అయ్యాయి. ఈ రెండు వైపుల నుంచి వచ్చిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టానికి లోబడి నాటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హైకోర్టు సందేహాన్ని వ్యక్తం చేసింది.
ఇక 103 రాజ్యాంగ సవరణ, కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ చట్టాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన పిటిషన్ల మీద పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక చూస్తే ఈడబ్ల్యూఎస్ చట్టంలో ఆర్ధికంగా వెనకబడిన అగ్ర కులస్తులు అందరికీ పది శాతం మేర రిజర్వేషన్లు కల్పించారు. వారికి విద్య ఉపాధిలో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఇందులో ఏమైనా మినహాయింపులు ఇస్తే రాష్ట్రాలు ఇవ్వవచ్చు అన్న దాని మీదనే చంద్రబాబు కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని అంటున్నారు. అయితే మొత్తం ఉన్నదే పది శాతం అయినపుడు అందులో సగం వాటాగా అయిదు శాతం కాపులకే ఇస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అన్నది హైకోర్టు వ్యక్తం చేస్తున్న సందేహమని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే హైకోర్టు నివేదికను కోరింది అని అంటున్నారు. గతంలో సుప్రీంకోర్టులో ఈ తరహా పిటిషన్ల మీద విచారణ జరిగింది. దాంతోనే వాటి మీద పూర్తి నివేదికను హైకోర్టు తెప్పించుకుని పరిశీలిస్తుంది అని అంటున్నారు. ఇక ఈ కేసును ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే కాపులకు రిజర్వేషన్ల అంశం ఇపుడు మరో సారి చర్చకు దారి తీస్తోంది. కాపులకు ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటే హైకోర్టులో సానుకూలంగా తీర్పు రావాల్సి ఉంది. దాంతో కాపుల రిజర్వేషన్ అన్నది మళ్లీ అయోమయంలో పడింది అని అంటున్నారు.