Begin typing your search above and press return to search.

నిరసనలకు పిలుపునిచ్చి డుమ్మా.. ఇదేందయా కేటీఆర్..! బీఆర్ఎస్‌లో ఒకటే చర్చ

అంతెందుకు ఈ పర్యాయం కాకుండా.. అంతకుముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ప్రతిపక్ష పాత్రను ఏ స్థాయిలో నిర్వహించాడో అందరం చూశాం.

By:  Tupaki Desk   |   21 Oct 2024 7:26 AM GMT
నిరసనలకు పిలుపునిచ్చి డుమ్మా.. ఇదేందయా కేటీఆర్..! బీఆర్ఎస్‌లో ఒకటే చర్చ
X

పదేళ్ల పాటు అధికారంలో ఉండిపోయిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి సారి ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ తనదైన శైలిలో ప్రతిపక్ష పోషిస్తుండేది. అంతెందుకు ఈ పర్యాయం కాకుండా.. అంతకుముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ప్రతిపక్ష పాత్రను ఏ స్థాయిలో నిర్వహించాడో అందరం చూశాం. ఆ తరువాత ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఆ క్రమంలో చంద్రబాబు ప్రతిపక్ష పాత్రలో కీ రోల్ పోషించారు. ప్రభుత్వం చేస్తు్న్న తప్పిదాలపై నిలదీయడంతోపాటు, ప్రజా సమస్యలపై పోరాడడమే ప్రతిపక్ష పార్టీ ముందున్న లక్ష్యం అన్నది తెలిసిందే.

మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే.. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఆ పార్టీ ఫెయిల్ అయినట్లుగా చర్చ నడుస్తున్నది. అందులోనూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడంలేదు. ఆయన పెద్దగా దేనినీ పట్టించుకోవడంలేదు. పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూస్తూ వస్తున్నారు. కేసీఆర్ కేవలం ఫాంహౌజ్‌కే పరిమితం అయిపోయారు. అక్కడే నిత్యం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను కలుస్తున్నారు. అంతే తప్పితే పార్టీ ఎలా ముందుకు పోవాలో ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లుగా అయితే కనిపించడం లేదు.

దాంతో.. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక నేత హరీశ్ రావు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు గత పది నెలలుగా వీరే ప్రభుత్వంపై పోరాడుతూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తున్నారు. రైతు సమస్యలు కానీ.. ఆరు గ్యారంటీలు కానీ.. విద్యార్థుల సమస్యలు కానీ ప్రతి దానిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇక హైదరాబాద్ నగరంలో తీవ్ర చర్చకు దారితీసిన హైడ్రా, మూసీలపైనా తమదైన శైలిలో కొట్లాడుతున్నారు. అయితే ఇంత చేస్తున్నప్పటికీ పార్టీకి మాత్రం వస్తున్న క్రేజీ అంతంత మాత్రమే అన్న భావన కేడర్‌లో కనిపిస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు పూర్తయినా ఇప్పటివరకు రైతుభరోసా ఇవ్వలేదు. అంతేకాకుండా ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుభరోసా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ పిలుపునిచ్చారు. ప్రతీ మండల కేంద్రంలోనూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

దాంతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. అయితే.. ఈ ధర్నాలు కూడా అంతటా జరగలేదన్న టాక్ ఉంది. జరిగిన చోట కూడా నామమాత్రంగా నిర్వహించారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో ధర్నా కార్యక్రమం అంటే గులాబీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చేవారు. కానీ.. నిన్న ఆ పరిస్థితి కనిపించలేదు. అంతటా పదుల సంఖ్యలోనే పాల్గొన్న నేతలతోనే ధర్నా కార్యక్రమాలు జరిగాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం అవి జిల్లా కేంద్రాల వరకే పరిమితం అయ్యాయి. మండల కేంద్రాల్లో చేపట్టలేదు.

అయితే.. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ముందుండి పార్టీని నడిపించాల్సిన కేటీఆర్ నిన్న వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ధర్నాలకు పిలుపునిచ్చిన కేటీఆర్ ఎక్కడా ధర్నా కార్యక్రమంలో పాల్గొనలేదు. రంగారెడ్డి జిల్లాలో ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు నిర్వహించిన దసరా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యా్ప్తంగా కార్యకర్తలు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటే పార్టీ కీలక నేత మాత్రం దసరా సమ్మేళనంలో పాల్గొనడం కొత్త వివాదానికి తెరలేపింది. అటు హరీశ్ రావు కూడా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన అలయ్.. బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కూడా ధర్నాకు హాజరుకాలేదు. దీంతో ఇద్దరు కీలక నేతలు ధర్నాలకు డుమ్మా కొట్టడంపై కార్యకర్తలు పెదవి విరిచారు. పార్టీలో ఒకవిధంగా అసంతృప్తికి తెరతీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై కేటీఆర్, హరీశ్ ఏం సమాధానాలు ఇస్తారో చూడాలి.