ఇదో లొట్టపీసు కేసు: కేటీఆర్
తనపై కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ఈ ప్రయత్నంలో ఇది ఆరో కేసని ఆయన వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 1 Jan 2025 1:05 PM GMTతనపై నమోదైన 'ఫార్ములా ఈ-రేస్' కేసును మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వహణాధ్యక్షుడు కేటీఆర్ లైట్ తీసుకున్నారు. దీనిని 'లొట్టపీసు కేసు' అంటూ సెటైర్లు వేశారు. తనపై నమోదు చేసిన కేసులో ఎలాంటి పసలేదని వ్యాఖ్యానించారు. తనపై కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ఈ ప్రయత్నంలో ఇది ఆరో కేసని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఫార్ములా ఈ-రేస్‌లో అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని మండిపడ్డారు. ఏదో పెట్టాలని పెట్టడమే తప్ప.. దీనిలో ఇంకే మీలేదన్నారు. ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణలో అడ్వకేటు నీళ్లు నమిలాడని ఎద్దేవా చేశారు.
న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ వద్ద ఎలాంటి ఆన్సర్ లభించలేదన్నారు. అయితే.. ఈ నెల 7న తనను రమ్మని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని.. తన తరఫున న్యాయవాదులు వెళ్తారని.. ఈడీ అడిగే ప్రశ్నలకు న్యాయవాదులు సమాధా నం చెబుతారని అన్నారు. తనపై కేసు పెడితే.. సీఎం రేవంత్ రెడ్డిపైనా కేసు పెట్టాలని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు, చట్టంపైనా తనకు నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. తనను బద్నాం చేయాలని చూస్తున్నవారే బద్నాం అవుతారని ఆయన తెలిపారు. ఈ కేసులో తనపై ఎలాంటి మరకలు అంటించలేరని అన్నారు.
కాగా, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌లో ముందస్తుగానే చెల్లింపులు జరిగాయని.. ఈ క్రమంలో ఖజానా నుంచి 46 కోట్ల రూపాయలు.. విడుదల చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఇది నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందన్నారు. అయితే.. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ.. కేటీఆర్ రాష్ట్ర హైకోర్టులలో క్వాష్ పిటిషన్ వేశారు. అదేవిధంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా పిటిషన్లు వేశారు.
మంగళవారం నాటి విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఆదేశాలతో ఈ నిధులను నిర్వహణ సంస్థలకు ముందస్తుగానే చెల్లించారని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.