లోకేష్ వారసత్వం... సమ్మతించడం అనివార్యం ?
అలా నారా లోకేష్ ని వారసుడిగా ఎదిగిన నాయకుడిగా చూడాలా అంటే చూడక తప్పదు.
By: Tupaki Desk | 21 Jan 2025 3:05 AM GMTవారసత్వం అన్నది భారతీయ సామాజంలో ఎప్పటి నుంచో ఉంది. అది తప్పు అయితే కాదు అన్నది చాలా మంది భావన. సమర్ధత ఉంటే వారసత్వం ఒక చాన్స్. లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. ఇక రాజకీయాల్లో చూస్తే కనుక వారసులు కచ్చితంగా వస్తారు. అలా నారా లోకేష్ ని వారసుడిగా ఎదిగిన నాయకుడిగా చూడాలా అంటే చూడక తప్పదు.
అయితే ఆయన తనను తాను నిరూపించుకునే క్రమంలో చాలానే ఎదిగారు. ఆయన ప్రసంగాలు చాలా రాటు తేలుతున్నాయి. దక్షతను నిరూపించుకుంటున్నారు. అంతకంతకు ప్రజాదరణను పెంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీకి చంద్రబాబు తరువాత లోకేష్ వారసత్వం అనివార్యం. అది ఈ టెర్మ్ లోనే మరింతగా బలపడడమూ అనివార్యం.
ఎందుచేతనంటే చంద్రబాబు వయసు ఈ రోజుకు ఏడున్నర పదులు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఎనిమిది పదుల వయసుకు చేరువ అవుతారు. అందువల్ల టీడీపీ లాంటి క్యాడర్ బేస్ ఉన్న పార్టీకి కొత్త నాయకత్వాన్ని చూపించాల్సిన అవసరం అగత్యం కచ్చితంగా ఉంది.
అందులో తప్పేమీ లేదు కూడా. రాజకీయాలు అంటే లక్షలాది మందితో ముడిపడి ఉన్న వ్యవహారం స్థిరమైన నాయకత్వం ఉండాలని పార్టీ లోని వారు అంతా కోరుకుంటారు. ఈ రోజున చంద్రబాబు రేపటి రోజున లోకేష్ అని క్యాడర్ అయితే పక్కాగా డిసైడ్ అయిపోయింది.
ఇక దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం తెలివిడి అనిపించుకుంటుంది. అలా అధికారం చేతిలో ఉండగానే లోకేష్ కి ప్రమోషన్లు ఇస్తూ ఆయన ప్రతిభకు పనితీరుకూ పదును పెడుతూ ముందుకు తీసుకుని పోవాలని కూడా పార్టీ యావత్తూ చూస్తుంది.
ఆ క్రమంలో నుంచి పుట్టినదే లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి అన్న డిమాండ్. ఇది టీడీపీకి సంబంధించిన వ్యవహారం. అది ఆ పార్టీలో వారు మాత్రమే పరిష్కరించుకోవాల్సినది కూడా. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి అని పేరుకు ఏపీలో ఉన్నా మెజారిటీ సీట్లు అందులో టీడీపీకే ఉన్నాయి. లెక్కకు చూస్తే 134 సీట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలవే.
అలా చూసుకుంటే లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయడమే కాదు ముఖ్యమంత్రిని చేయాలనుకున్నా ఎవరూ అడిగే వారు కూడా లేరు అన్నది వాస్తవరం. అయితే టీడీపీ నుంచి ఈ డిమాండ్ వచ్చినపుడు జనసేన నుంచి ఎందుకు రియాక్షన్ వస్తుందో అన్నది కూడా అర్ధం కానిదే. మరో మిత్ర పక్షం బీజేపీ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాకపోవడం కూడా గమనించాల్సిన విషయం.
టీడీపీ కూటమిని అధినాయకుడు చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఎవరిని మంత్రులుగా చేయాలి, ఎవరిని తీసేయాలి అన్నది పూర్తి నిర్ణయాధికారం కలిగి ఉంటారు. అలా చూసుకుంటే కనుక లోకేష్ ని కుమారుడుగా కాకుండా టీడీపీ భావి వారసుడిగా భావించి ప్రమోషన్ ఇవ్వాలనుకోవడంలో బాబు ఆలోచనలు బలంగా ఉంటే ఆపేది కూడా ఉండదు.
ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. 2002 ప్రాంతంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉనంపుడు వాజ్ పేయ్ ఉప ప్రధానిగా అద్వానీని నియమించారు. అపుడు ఆ కూటమి పాతిక పార్టీల అలయెన్స్ తో ఏర్పడినది. అయినా బీజేపీకి చెందిన అద్వానీకి ఆ హోదా వాజ్ పేయి ఇచ్చారు. ఆయనను ఫ్యూచర్ పీఎం క్యాండిడేట్ గా అలా ఎక్స్ పోజ్ చేశారు. మరి బీజేపీకి పూర్తి స్థాయి బలం ఆనాడు లేదు.
అయినా మిత్ర పక్షాలేవీ వ్యతిరేకించలేదు. ఎన్డీయే లీడర్ గా ఆయన డెసిషన్ ని గౌరవించాయి. ఇపుడు కూడా బాబు అలాంటి నిర్ణయం తీసుకుంటే అనివార్యంగానే సమ్మతించాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకేష్ టీడీపీ వారసుడు అని తెలిసే మిత్రులు పొత్తుకు వచ్చారు. ఆయన సీఎం క్యాండిడేట్ అని బాబు తరువాత ఫ్యూచర్ లీడర్ అని తెలిసే పొత్తులకు దిగాక ఇపుడు మాత్రం ఆయా పార్టీల నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం మాత్రం రాజకీయ రీతి కాదేమో అని అంటున్నారు.
ఏది ఏమైనా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారు, సీఎం కూడా అవుతారు, పొత్తుల్లో ఉన్న పార్టీలు సమ్మతించడమూ అది అనివార్యమూ రాజకీయ అవసరమూ కూడా కావచ్చు. ఆ రోజు వచ్చినపుడు అదే జరుగుతుంది కూడా. అంతవరకూ వెయిట్ చేయడమే.