టీడీపీకి కొత్త గ్లామర్...మోక్షజ్ఞతో ఆ లోటు తీరిపోతుందా ?
ఆయన కేవలం తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తెచ్చారు.
By: Tupaki Desk | 9 Sep 2024 2:30 AM GMTతెలుగుదేశం పార్టీ పుట్టిందే సినీ గ్లామర్ తో. అన్న నందమూరి తారక రామారావు టాప్ స్టార్ గా ఉంటూనే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళి సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన కేవలం తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తెచ్చారు.
ఆ పార్టీకి నాటి నుంచి నేటి వరకూ సినీ గ్లామర్ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక ఆయన కుమారుడు బాలయ్య అపుడు సినీ హీరోగా రాణిస్తూనే పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పెట్టారు. అలాగే పార్టీకి విజయాలు కూడా దక్కయి.
బాలయ్య టీడీపీని గెలిపించడం తన బాధ్యతగా భావిస్తూ గత నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. ఆయన తరువాత సినీ రంగం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం పాటు పడ్డారు. భారీ ఎత్తున ప్రచారాన్ని ఇటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి తెలంగాణాలోని ఆదిలాబాద్ దాకా చేపట్టాడు. సుడిగాలి మాదిరిగా జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో చెలరేగి అద్భుతమైన ప్రచారం చేసిపెట్టారు.
బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆనాడు టీడీపీ పవర్ లోకి రాలేదు. ఇక జూనియర్ ప్రచారం చేయని 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అఫ్ కోర్స్ 2019లో ఆ పార్టీ దారుణంగా ఓడింది. ఈ నేపధ్యంలో కీలక సందర్భాలలో జూనియర్ కోసం ఎదురుచూడడం టీడీపీ శ్రేణులకు అలవాటుగా మారింది. ఏపీ రాజకీయాల్లో ప్రతీ చిన్న విషయానికి జూనియర్ రియాక్ట్ కావాలని వారు కోరుకుంటూ వచ్చారు.
అంతే కాదు చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా జూనియర్ నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కోరుకున్నారు. కానీ సినిమాలకు అంకితం అని ఒక గీత పెట్టుకున్న జూనియర్ తన పని తాను చేసుకుంటూ వచ్చారు. ఆయన ఆలోచనలు క్లియర్ గా ఉన్నా టీడీపీ క్యాడర్ మాత్రం ఆయనను పార్టీ మనిషిగా ఇంతకాలం చూస్తూ వచ్చింది
ఇదిలా ఉంటే హోరా హోరీగా మరో కురుక్షేత్రంగా జరిగిన టీడీపీ వర్సెస్ వైసీపీ గా 2024 ఎన్నికలో టీడీపీ అద్భుతమైన విజయం సాధించింది. దాంతో టీడీపీకి రాజకీయంగా చూస్తే కనీసంగా మరో దశాబ్దం వరకూ ఎదురులేదన్న పరిస్థితి ఉంది. అదెలా అంటే అయిదేళ్ళ పాటు నిండుగా అధికారం ఉంటుంది. ఈ పవర్ తో మరోసారి గెలిచే ప్రయత్నం ఎటూ ఉంటుంది.
అలా కాదనుకున్నా 2029లో ఏమైనా రిజల్ట్ తేడా కొట్టినా టీడీపీ స్ట్రాంగ్ గా ఆ అయిదేళ్లలోనూ పోరాడే శక్తిని సంపాదించుకుంటుంది. టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేష్ బాబు ధీటుగా ఎదుగుతున్నారు. దాంతో ఇక్కడ వారసత్వం విషయంలో ఇబ్బంది లేదు అక్కడ సినీ ఫీల్డ్ లో బాలయ్య కొండంత అండగా ఉన్నారు.
ఆయన తరువాత ఎవరూ అంటే నిన్నటి దాకా జూనియర్ వైపు అంతా చూసేవారు. ఇపుడు మోక్షజ్ఞ రంగంలోకి దూకుతున్నారు. ఆయన మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ని అందుకునేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఉంచారు. ఈ అయిదేళ్లలో మోక్షూ సినీ హీరోగా ఒక టాప్ లెవెల్ కి ఎదిగితే అది టీడీపీ కొత్త సినీ గ్లామర్ ని తెచ్చి పెడుతుందని అంటున్నారు.
ఆ విధంగా టీడీపీ థర్డ్ జనరేషన్ లో కూడా అపారమైన సినీ గ్లామర్ పంట పండే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. బాబుకు బాలయ్యలా లోకేష్ కి మోక్షజ్ఞ అంది వస్తారని కూడా ఆలోచనలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే తెలుగుదేశం ఈ అయిదేళలో రాజకీయంగా ఇతరత్రా కూడా అన్ని రకాలుగా స్ట్రాంగ్ గా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దానికి తగినట్లుగానే పరిస్థితులూ అనుకూలించే విధంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.