Begin typing your search above and press return to search.

మంత్రులకు ఏడాది గండం పొంచి ఉందా ?

వారి పనితీరుని ఎప్పటికపుడు మధింపు చేస్తూ బాబు వారికి దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   17 Dec 2024 8:30 PM GMT
మంత్రులకు ఏడాది గండం పొంచి ఉందా ?
X

ఏపీలో టీడీపీ కూటమి జూన్ 12న ఏర్పాటు అయింది. ఇప్పటికి నికరంగా ఆరు నెలల పదవీకాలం పూర్తి అయింది. మొత్తం 24 మంది మంత్రులను ఎంపిక చేసి మరీ చంద్రబాబు తన కొలువులో చేర్చుకున్నారు. అయితే ఇందులో మెజారిటీ కొత్తవారిగా ఉన్నారు. వారి పనితీరుని ఎప్పటికపుడు మధింపు చేస్తూ బాబు వారికి దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.

అయితే బాబు సూచనలను పాటించి మెరుగుపడిన వారు ఉన్నారు కానీ ఇంకా తడబాట్లు పడుతున్న వారు కూడా ఉన్నారని అంటున్నారు. దాంతో అటువంటి వారి విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఆలోచిస్తారా అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది.

ఏపీలో 25వ మంత్రి పదవిని భర్తీ చేస్తారు అన్న వార్తతోనే ఇపుడు ఇదంతా సాగుతోంది. కేవలం నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి అక్కడితో ఆగుతారా లేక ఒక చిన్న సైజు మార్పుచేర్పుల ప్రోగ్రాం ఉంటుందా అంటే రాజకీయ ప్రచారాన్ని చూస్తే కనుక కనీసంగా ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ టీడీపీ కూటమి మంత్రుల విషయంలో వేటు కత్తి వేలాడుతోంది అన్న హాట్ డిస్కషన్ కూడా సాగుతోంది.

అటువంటి వారిలో సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీకి ప్రభుత్వానికి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకుంటారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏడాది కూడా పూర్తి కాకుండానే కొంతమంది మంత్రి పదవులకు ఎసరు రావచ్చు అన్నది కూడా డౌటానుమానంగా ఉంది అని చెబుతున్నారు.

ప్రచారంలో ఉన్న వార్తలు లాంటివి చూస్తే కనుక వచ్చే ఏడాది ఉగాది నాటికి మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అంటే కొత్త ఆర్ధిక సంవత్సరం కొత్త తెలుగు సంవత్సరంలో కూటమి మంత్రివర్గంలో కీలకమైన మార్పులే జరగవచ్చు అని చెబుతున్నారు.

అలా చూస్తే కనుక జనసేన నుంచి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు విశాఖ నుంచి పల్లా శ్రీనివాస్ కి చోటు ఇస్తారని అంటున్నారు. ఆయన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు. మరి ఆయనకు చాన్స్ ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్ధసారధి విషయం ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆయన అదే సామాజిక వర్గం నుంచి ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఒకవేళ పల్లాకు చాన్స్ ఇస్తే పార్ధసారధికి ఇబ్బంది తప్పదన్న వార్తలూ వస్తున్నాయి. అదే ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి విజయవాడకు చెందిన వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇస్తారు అని అంటున్నారు. ఇక మరో మంత్రిగా కొల్లు రవీంద్ర కొనసాగవచ్చు అని అంటున్నారు.

అలా చేస్తే రంగా అభిమానులను పూర్తి స్థాయిలో తమ వైపునకు తిప్పుకోవచ్చని బలమైన కాపు సామాజిక వర్గం దన్ను కూడా దక్కుతుందని టీడీపీ ప్లాన్ అని అంటున్నారు. ఇక పల్లా శ్రీనివాస్ కి పదవి ఇవ్వడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆ సామాజిక వర్గం నుంచి కూడా సపోర్టు పూర్తిగా అందుకోవచ్చు అన్న ఆలోచన ఉందని అంటున్నారు.

ఇదే విధంగా జూనియర్ మంత్రులు ఒకరిద్దరి మీద కూడా కత్తి వేలాడుతోంది అని అంటున్నారు. వారి ప్లేస్ లో కూడా కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే మంత్రి వర్గ శాఖలను కూడా మార్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ చాలా మంది మంత్రుల జాతకాలు మారే అవకాశాలు అయితే ఉన్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉంది అన్నది వేచి చూడాల్సి ఉంది.