Begin typing your search above and press return to search.

భారత్ లో 2036 ఒలింపిక్స్.. కేంద్రం అధికారిక బిడ్?

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు కేంద్ర మంత్రులు ప్రకటనలు కూడా చేశారు.

By:  Tupaki Desk   |   5 Nov 2024 2:30 PM GMT
భారత్ లో 2036 ఒలింపిక్స్.. కేంద్రం అధికారిక బిడ్?
X

కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడలు, క్రికెట్ ప్రపంచ కప్ లు ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లు నిర్వహించింది భారత్. అయితే, ఒక్కటి మాత్రం సాధ్యం కాలేదు. అదే ఒలింపిక్స్. మహా సంగ్రామం లాంటి ఈ పోటీలను నిర్వహించడం ఆషా మాషీ కాదు. ఖర్చు రూ.2 లక్షల కోట్లుపై మాటే. అదీ ఇప్పటికిప్పుడు కాదు. మరో 12 ఏళ్ల తర్వాత. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రేట్లు ఇంకా పెరగొచ్చు కూడా. కానీ, 2036లో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు కేంద్ర మంత్రులు ప్రకటనలు కూడా చేశారు. తాజాగా కీలక ముందడుగు కూడా పడింది.

ఈ ఏడాది పారిస్ లో ఒలింపిక్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక 2028, 2032లో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. వచ్చేసారి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో, ఆపై ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జరగనున్నాయి. ఇక 2036లో ఒలింపిక్స్ ను భారత్‌ తో పాటు మరో 10 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిలో మెక్సికో (మెక్సికో సిటీ, గ్వాడలజారా-మాంటెర్రే-టిజువానా), ఇండోనేసియా (నుసంతారా), తుర్కియే (ఇస్తాంబుల్), భారత్ (అహ్మదాబాద్), పోలాండ్ (వార్సా, క్రాకో), ఈజిప్ట్ ( కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్), దక్షిణ కొరియా (సియోల్-ఇంచియాన్) పోటీ పడుతున్నాయి.

2036లో అక్కడేనా?

భారత్ ఇప్పటికైతే ఒలింపిక్స్ నిర్వహించే పరిస్థితిలో ఉంది. మరో 12 సంవత్సరాల తర్వాత సంగతి ఎలా ఉంటుందో? అయితే, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు మాత్రం ఒలింపిక్స్ నిర్వహణ భాగ్యం దక్కొచ్చని స్పష్టం అవుతోంది. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐవోఏ) 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ పంపింది.

కథ మారుతుంది..

భారత్ లో ఒలింపిక్స్ జరిగితే అది ఎంతో మేలు చేస్తుందని చెప్పొచ్చు. ప్రపంచ పటంలో మన దేశాన్ని ప్రముఖంగా నిలుపుతుంది. నిరుడు ముంబైలో 141వ ఇండియన్ ఒలింపిక్ కమిటీ సెషన్‌ లో 140 కోట్ల మంది భారతీయులు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా భారత్ ఆసక్తిని సమర్థించారు.