నేడు 24... మోహన్ బాబుపై చర్యలకు పోలీసులు సిద్ధం!!
ఈ ఘటనలో జర్నలిస్టు ఒకరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2024 4:19 AM GMTసినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జర్నలిస్టు ఒకరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో.. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే... ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. మరోపక్క జర్నలిస్టుపై దాడి అనంతరం విచారణకు రావాల్సి ఉండగా.. మోహన్ బాబు ఆస్పత్రిలో ఉండటంతో ఆయన విచారణతో పాటు అరెస్టు నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
అవును... హైకోర్టు ఈ నెల 24 (ఈ రోజు) వరకూ మోహన్ బాబు విచారణ, అరెస్టు వంటి వాటి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెబుతున్న నేపథ్యంలో.. ఆ గడువు నేటితో ముగుస్తుంది. మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.
దీంతో... మోహన్ బాబును ఈ రోజు, రేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. మరోపక్క ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు సోమవారం నాడు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ ఆయన తరుపు న్యాయవాది వెల్లడించారని అంటున్నారు.
మరోవైపు హైకోర్టు ఆదేశానుసారం, ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు అనంతరం మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో... మోహన్ బాబుపై పోలీసులు తీసుకోబోయే చర్చలపై సర్వత్రా చర్చ జరుగుతుందని అంటున్నారు.