షర్మిలతో తాడో పేడో : గట్టిగానే వైసీపీ టార్గెట్
టీడీపీ నేతల మాదిరిగానే షర్మిలను సైతం గట్టిగానే టార్గెట్ చేయాలన్నది ఒక విధాన నిర్ణయం.
By: Tupaki Desk | 27 Oct 2024 11:41 AM GMTవైఎస్సార్ తనయ వైఎస్ జగన్ సోదరి ఇలా షర్మిలకు రెండు ట్యాగ్స్ ఉన్నాయి. దాంతో ఆమె మీద విమర్శలు చేయాలంటే వైసీపీ నేతలకు అవి అడ్డు వస్తున్నాయి. అయితే ఇపుడు అధినాయకత్వం నయా వ్యూహం మేరకు అవేమీ అడ్డు కానే కావు. టీడీపీ నేతల మాదిరిగానే షర్మిలను సైతం గట్టిగానే టార్గెట్ చేయాలన్నది ఒక విధాన నిర్ణయం.
దీని ప్రకారం చూస్తే షర్మిల జగన్ సోదరి అని ఒక సున్నితమైన బంధం భావోద్వేగ మన్నది అసలు ఉండదనే అంటున్నారు. ఆమెను సిసలైన రాజకీయ ప్రత్యర్థిగానే భావించి దాడి చేయాల్సిందే అని హై కమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.
ఈ క్రమంలో చూసుకుంటే కనుక వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి నుంచి మొదలుపెడితే మాజీ మంత్రి పేర్ని నాని, కడప జిల్లా పులివెందుల నుంచి సతీష్ రెడ్డి, చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశాఖ నుంచి గుడివాడ అమర్నాధ్, వైసీపీ ఏపీ మహిళా విభాగం చైర్మన్ వరుదు కళ్యాణి అంతా కలసి ఒక్కసారిగా షర్మిల మీద విమర్శలు ఎక్కుపెట్టారు.
షర్మిల చంద్రబాబులను కలుపుతూ వీరంతా ప్రెస్ మీట్ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ని మళ్లీ జైలుకు పంపించడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని దానిలో షర్మిల పావుగా మారిందని వారు విమర్శించారు.సొంత అన్నను జైలుకు పంపడానికే షర్మిల ఇలా చేయడం దారుణమని కూడా ఘాటుగా విమర్శించారు.
ఆమె బాబు కళ్లలో ఆనందం చూడడానికే పడరాని పాట్లు పడుతున్నారని కూడా అంటున్నారు. షర్మిల వైఖరి వల్లనే వైఎస్సార్ కుటుంబానికి ఇబ్బందులు వస్తున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. జగన్ ని జైలుకు పంపించిన వారితో షర్మిల చేతులు కలపడం కంటే దిగజారుడు రాజకీయం మరోటి లేదని అంటున్నారు.
ఇలా అంతా కలసి షర్మిల మీద ఒక్కసారిగా విరుచుకుపడడానికి వైసీపీ మారిన వ్యూహమే కారణం అని అంటున్నారు. షర్మిల ఎక్కడా జగని స్పేర్ చేయడం లేదు. ఆమెను పీసీసీ చీఫ్ గా అయిన మొదట్లో పెద్దగా వైసీపీ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె చేసిన ఆరోపణలు జనంలోకి వెళ్ళి 2024 ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష పార్టీకి అవసరమైన సీట్లు కూడా దక్కలేదు అని అంటున్నారు.
ఓటమి తరువాత ఎటూ షర్మిల అధికార టీడీపీ కూటమి మీందనే విమర్శలు చేస్తుందని అనుకున్నారు కానీ ఆమె జగన్ మీదనే దాడి చేస్తున్నారు. ఆయననే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఆస్తుల ఇష్యూ బయటకు వచ్చింది.
తల్లిని చెల్లెలుని అని చూడకుండా కోర్టులకు జగన్ ఈడ్చారు అని షర్మిల మీడియా మీటింగ్స్ పెట్టి మరీ వైసీపీని అతలాకుతలం చేస్తున్నారు. దాంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పార్టీ హై కమాండ్ ఆలస్యంగా అయినా గుర్తించింది అని అంటున్నారు.
ముఖ్యంగా మహిళలలో ఈ అంశాలు వెళ్తే నెగిటివిటీ పార్టీకి పెరిగే వీలు ఉందని కూడా అంటున్నారు. దాంతో షర్మిల వాయిస్ బయటకు వెళ్లేలోగా దానికి రెట్టింపు వాయిస్ తో వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వాస్తవాలు చెబితే జనాలు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నారు.
షర్మిల ఏకంగా వైసీపీ రాజకీయ పునాదుల మీదనే దాడి చేస్తున్నారని అంతిమంగా వైసీపీ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని కూడా ఆందోళన చెందుతున్న క్రమంలోనే పార్టీ మొత్తాన్ని పిలిచి మరీ షర్మిలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు అని అంటున్నారు.
షర్మిల చేసిన పని వల్ల జగన్ బెయిల్ రద్దు అయి ఆయన జైలుకు వెళ్తారు అన్నది జనంలోకి తీసుకుని పోవాలని కూడా వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. జగన్ సోదరి అని షర్మిలను ఇక మీదట ఎక్కడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదని కూడా పార్టీ నేతలకు ఆదేశాలు స్పష్టంగా వెళ్లాయని అంటున్నారు.
దాంతో షర్మిల మీద స్ట్రాంగ్ గానే అంతా విమర్శలు గుప్పించారు. మరో వైపు షర్మిలకు చంద్రబాబు టీడీపీ మద్దతు తెలపడాన్ని కూడా వైసీపీ నేతలు ముడిపెడుతూ ఆమె ఆ పార్టీతో కుమ్మక్కు అయింది అన్నది కూడా ప్రచారంలోకి తెస్తున్నారు. మొత్తానికి షర్మిలతో తాడో పేడో తేల్చుకునేందుకు వైసీపీ హై కమాండ్ రెడీ అయింది అని అంటున్నారు. మరి షర్మిల విషయంలో వార్ ఇక్కడితో ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అంటే విశ్లేషణలు కనుక చూస్తే ఇపుడే అసలైన కధ మొదలైంది అని అంటున్నారు. సో ముందు ముందు షర్మిల వర్సెస్ వైసీపీ ఒక టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగే చాన్స్ ఉంది అని అంటున్నారు.