అసెంబ్లీకి వైసీపీ... జగన్ అలా డిసైడ్ చేస్తారా ?
అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అని ఒక పక్కన స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 10 Feb 2025 10:30 PM GMTఏపీ అసెంబ్లీలో అధికార పక్షమే ఉంది. విపక్షం అయితే సభకు వెళ్ళడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది. కానీ అది అయ్యే పని కాదని రూల్స్ ని చెబుతోంది అధికార కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఏకంగా పదిహేను రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరు అవుతుందా అన్నది ఆసక్తిని పెంచే అంశంగా మారింది.
అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అని ఒక పక్కన స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. దాంతో సభకు రావాల్సిన అనివార్యత వైసీపీకి ఏర్పడుతోందా అన్నది కూడా చూడాల్సి ఉంది. అసెంబ్లీలో కూటమి పార్టీలే మొత్తం పరచుకుని ఉన్నాయి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
దాంతో పాటు విపక్ష హోదా ఇవ్వరు కాబట్టి జగన్ తో పాటు అంతా సాధారణ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. వారికి ఇచ్చే సమయం కూడా తక్కువగా ఉంటుంది. వారు కోరినా ఇచ్చే విషయంలో స్పీకర్ విచక్షణ మీదనే ఉంటుంది. అలాగే ఒక అంశం మీద మాట్లాడుతున్న సమయంలో చెయిర్ ఏమైనా అభ్యంతరం అనుకుంటే మైక్ ని కట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అదే విపక్ష నేతగా ఉంటే కచ్చితంగా మైక్ దక్కుతుంది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడిన తరువాత కౌంటర్ చేయడానికి వీలు ఉంటుంది. కానీ ఈసారి సభకు జగన్ వస్తే ఒక సాధారణ సభ్యుడిగా మాత్రమే అతి తక్కువ సమయం పొందుతారు.
అలాగని సభకు రాకుండా ఉంటే అనర్హత వేటు అనే గండం ఉంది అంటున్నారు. కూటమి ప్రభుత్వం పెద్ద వ్యూహంతోనే ఈ బడ్జెట్ సమావేశాలలో ఉందని అంటున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. సభా నిబంధనలతో విశేష అధికారాలతో తీసుకునే ఈ నిర్ణయాన్ని కోర్టుకు కూడా తప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు.
దాంతో వైసీపీ కోర్టులోనే బంతి ఇపుడు ఉంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 12న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరుపుతారని అసెంబ్లీకి హాజరు కావాలా వద్ద అన్న దానిని ఆయన చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇక వైసీపీ శాసనసభా పక్షం నుంచి ఫలానా వారు లీడర్ అని స్పీకర్ కి లేఖ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.
అదే సమయంలో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు వారు తమ నియోజకవర్గంలో సమస్యలను చెప్పుకోవాలని ఆశ పడుతున్నారు. అధ్యక్షా అని వారు సభలో తన గళం విప్పాలని ప్రజా సమస్యలను ప్రస్తావించాలని చూస్తున్నారు. దాంతో అందరి అభిప్రాయాలను తీసుకుని సభకు వైసీపీ హాజరవుతుందా లేక ఏమైనా చేసుకోనీ అన్నట్లుగా తన ప్రతిపక్ష హోదా డిమాండ్ కే కట్టుబడి ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.