అంతా జగన్ చేతులలోనే ?
ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎంపీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన వైసీపీ 2012 ఉప ఎన్నికల నాటికి మొత్తం 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 15 దాకా గెలుచుకుంది.
By: Tupaki Desk | 25 Jan 2025 10:30 PM GMTవైసీపీ ఎగిసి పడిన కెరటంగా ఉంది. ఆ పార్టీ ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో సృష్టించిన రాజకీయ ప్రభంజనం ఒక సంచలనంగానే చూడాలని అంటారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎంపీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన వైసీపీ 2012 ఉప ఎన్నికల నాటికి మొత్తం 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 15 దాకా గెలుచుకుంది. ఆనాడు ప్రధాన పార్టీలకు డిపాజిట్లు సైతం గల్లంతు అయ్యాయి.
అంతే కాదు 2014 ఎన్నికల్లో కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠానికి దూరం అయింది. బలమైన ప్రతిపక్షం గా అవతరించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ పొలిటికల్ సునామీ సృష్టించింది. సొంతంగా ఒంటరిగా పోటీ చేసి మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 151 సీట్లను సాధించింది. 50 శాతం పైగా ఓటు షేర్ ని పొందింది.
అయితే గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి వైసీపీ 11 సీట్లకే పడిపోయింది. దారుణమైన ఓటమి తరువాత పార్టీ చతికిలపడి పోయింది. ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడిపోతున్నారు. అందులో పునాదుల నుంచి ఉన్న వారు బలమైన బంధాలను కూడా పార్టీ అధినేత జగన్ తో పెనవేసుకున్న వారు సైతం గుడ్ బై కొట్టేస్తున్నారు.
దాంతో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉందా అన్న చర్చ కూడా మరో వైపు మొదలైపోయింది. వైసీపీ పని అయిపోయింది అని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. అయితే రాజకీయాల్లో పార్టీల పని అయిపోవడం అన్నది ఎపుడూ ఉండదు. ఏది జరిగినా అధినాయకత్వం చేతిలోనే ఉంటుంది అన్నది చరిత్ర చెప్పిన సత్యం. 1977లో ఇందిరా గాంధీ భారీ ఓటమి తరువాత ఇక ఆమె పని అయిపోయింది అన్న వారు ఎంతో మంది ఉన్నారు.
అంతే కాదు ఆమె వెన్నటి ఉన్న కీలక నాయకులు పార్టీని వీడిపోయారు. కాంగ్రెస్ నుంచి ఆమెను దూరం చేశారు. అయితే ఆమె కాంగ్రెస్ ఐ అని కొత్త పార్టీని జాతీయ స్థాయిలో స్థాపించి తిరిగి పుంజుకున్నారు. ఆమె మళ్ళీ ప్రధాని అయ్యారు. ఆమె పెట్టిన పార్టీయే అసలైన కాంగ్రెస్ గా కూడా గుర్తింపు పొందింది. ఆమెని కష్టకాలంలో వీడి వెళ్ళిన వారు అంతా తిరిగి అదే కాంగ్రెస్ ఐ లోకి వచ్చేశారు.
ఇక దేశంలో కూడా అనేక చోట్ల ఇలాంటివి జరిగాయి. అయితే రాజకీయ పార్టీలు తిరిగి పుంజుకోవాలంటే అధినాయకత్వం సత్తా సంకల్పం మీదనే అదంతా ఆధారపడి ఉంటుంది. తెలుగు నాట కూడా అనేక మంది నాయకులు అలా దిగువకు పడిపోయి ఎదిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
ఇపుడు వైసీపీకి కష్టకాలం నడుస్తోంది అని అంటున్నారు. అయితే వైసీపీ తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలంటే జగన్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నదే ఇక్కడ ముఖ్యం. ఆయన చుట్టూ కోటరీ ఉందని ప్రచారం ఉన్న మాట. అంతే కాదు ఐప్యాక్ వ్యూహాలను అమలు చేస్తారని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలతో నేరుగా కనెక్షన్ ఉంటే ఏ వ్యూహకర్తలూ అవసరం లేదు. అలాగే క్యాడర్ తో గ్యాప్ లేకుండా చూసుకుంటే వారికి మించిన సైన్యం లేదు. గతంలో అలాగే అన్ని పార్టీలు గెలిచాయి.
పాలిటిక్స్ లో ఎంత కార్పొరేట్ కల్చర్ ప్రవేశపెట్టబడినా కూడా ఎంతటి వ్యూహకర్తలు వచ్చినా కూడా రాజకీయం అన్నది జనంతోనే చేయాలి. అందువల్ల ప్రజల నాడి నాయకుడి కంటే కూడా పొలిటికల్ కన్సల్టెంట్లకు తెలుస్తుంది అన్నది కూడా ఒక భ్రమ మాత్రమే.
కొన్ని సార్లు వారు చేసిన సర్వేలు కానీ వారి అంచనాలు కానీ నిజం కావచ్చు. అంత మాత్రం చేత వారినే గుడ్డిగా నమ్ముకుని ముందుకు పోవడం అన్నది మాత్రం తప్పుగానే సంప్రదాయ రాజకీయ వాదులు చూస్తారు. వైసీపీ అధినాయకత్వం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపి ఆధారపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటున్నారు.
దానికి చేఅయాల్సింది అధినాయకత్వంతో పాటు అంతా జనంలో ఉండడం. నిరంతరం ప్రజలతో అనుసంధానం కావడం. అలాగే ప్రజాదరణ ఉన్న నాయకులను ప్రోత్సహించడం. వైసీపీ విషయానికి వస్తే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా 11 సీట్లు వచ్చినా 40 శాతం ఓటు షేర్ ఆ పార్టీకి ఉంది. అది చాలా స్ట్రాంగ్ హోల్డ్.
ఇక వైసీపీకి ఉన్న లక్ ఏంటి అంటే కూటమిలోని పార్టీలు వైసీపీ ఓటు బ్యాంక్ ని లాగేసుకునే పరిస్థితి లేదు. అది ప్రత్యేకమైన ఓటు బ్యాంక్. జాతీయ స్థాయిలో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమికి ఎలాగు వేరుగా ఓటు బ్యాంక్ ఉందో అలాంటిది ఇక్కడ ఉంది. ఇండియా కూటమి ఏపీలో బలంగా అడుగుపెట్టినా లేక కాంగ్రెస్ పటిష్టం అయినా అపుడే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది.
ఇపుడు చూస్తే అలాంటి వాతావరణం లేదు కాబట్టి వైసీపీకి అదే శ్రీరామ రక్ష అని అంటున్నారు. అందువల్ల వైసీపీ మళ్ళీ పుంజుకోవడం ఎలా అన్నది పూర్తిగా జగన్ చేతిలోనే ఉంది అని అంటున్నారు. మరి ఆయన ఫోకస్ ప్లాన్స్ దూకుడు ఇవే వైసీపీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయని అంటున్నారు.