Begin typing your search above and press return to search.

వాళ్ల‌కు జ‌గ‌న్ సోష‌ల్ గేలం.. చిక్కుకుంటారా..?

ఒకప్పుడు టిడిపిలో వెనుకంజ కనిపించిన పరిస్థితి కూడా ఆశ్చర్యం వేసింది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 10:30 AM GMT
వాళ్ల‌కు జ‌గ‌న్ సోష‌ల్ గేలం.. చిక్కుకుంటారా..?
X

సోషల్ మీడియాలో పుంజుకోవాలని సోషల్ మీడియాను బలోపేతం చేయాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. నిజానికి రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే కూడా వైసీపీ సోషల్ మీడియా ఎన్నికలకు ముందు వరకు కూడా చాలా బలంగా పనిచేసింది. ఒకప్పుడు టిడిపిలో వెనుకంజ కనిపించిన పరిస్థితి కూడా ఆశ్చర్యం వేసింది. దీంతో హుటాహుటిన స్పందించిన నారా లోకేష్ ఎన్నికలకు ఆరు మాసాల ముందు సోషల్ మీడియా బాధ్యతలను తిరిగి పర్యవేక్షించడం ప్రారంభించారు.

దీంతో టిడిపి సోషల్ మీడియా పుంజుకుంది. అయితే, ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని ప్రధాన మీడియాను ఎదుర్కొనే క్రమంలో సోషల్ మీడియా బలంగా ఉండాలని జగన్ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు దీనిలో ఉన్నటువంటి లోపాలను గమనిస్తే సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నది ఎవరు? అనేది ప్రధాన చర్చ. లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామై వ్యవహరించారు.

సోషల్ మీడియాలో పనిచేసే వారిని తమవారిని పెట్టుకోవడం కూడా చేశారు. దీనిని ప్రశ్నించిన సొంత పార్టీ నాయకులను సైతం కేసుల్లో ఇరికించడం వంటివి చాలాచోట్ల కనిపించాయి. పోనీ బలమైనటువంటి కౌంటర్ ఇచ్చారా? అంటే ఇవ్వలేకపోయారు. ఇక తనను చూసి ఓట్లు వేసే వాళ్ళు సోషల్ మీడియాతో ఏం ప్రభావితం అవుతారు? అని భావించిన జగన్ కూడా అప్పట్లో సోషల్ మీడియాను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కానీ ఎన్నికల్లో కూటమి పార్టీల ప్రభావంతో పాటు ప్రధాన మీడియా దూకుడుకు సోషల్ మీడియా మరింత కలిసి వచ్చింది.

ఇది తటస్థ ఓటర్లను ప్రభావితం చేసింది దీని ప్రభావమే 10% పైగా ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైపోయిం ది. దీనిని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తటస్థ ఓట‌ర్ల‌ను తన వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాను బలోపేతం చేయడం తప్ప మరో మార్గం లేదని గ్రహించారు. అయితే ఆయన ఈ విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది సోషల్ మీడియాను హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుంది.

ఈ వ్యక్తులను ఎవరిని నియమిస్తారనేది జగన్ నిర్ణయాన్ని బ‌ట్టి ఉంటుంది. ఎలా చూసుకున్న సోషల్ మీడియా బలంగా ఉండాలంటే బలమైన వ్యూహాలు ఉండాలి. బలమైన నాయకులు ఉండాలి. అదే విధంగా దీనికి పెట్టుబడి పెట్టేవారు కూడా కావాలి. టిడిపిలో అయితే ప్రతినెలా ఇంతని జీతం ఇచ్చి సోషల్ మీడియాలో సబ్ ఎడిటర్లను, ఎడిటర్లను, కంటెంట్ రైటర్లను కూడా తీసుకుంటున్నారు. మరి ఆ దిశగా వైసిపి అడుగులు వేస్తుందా? లేక కార్యకర్తలను ఉపయోగించుకుంటుందా? అనేది చూడాలి.