'కడప'లో కాపాడుకోలేక పోయారు..!
అయినప్పటికీ.. వైసీపీ నాయకులు, అధినాయకుడు కూడా మౌనంగానే ఉంటున్నారు.
By: Tupaki Desk | 15 Oct 2024 4:30 PM GMTకడప.. ఈ పేరు చెప్పగానే ఠక్కున జగన్ రాజకీయాలు, వైసీపీ హవా వంటివి కళ్లకుకడతాయి. ఎక్కడ ఏం జరిగినా.. వైసీపీ నాయకుల పాత్రే ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే వైసీపీకి ఈ జిల్లా బలమైన కంచుకోట. అలాంటి జిల్లాలో ఎన్నికల తర్వాత పట్టు సడలిపోతోంది. నాయకులు పార్టీ మారుతున్నారు. మునిసిపాలిటీలు చేజారుతున్నాయి. టీడీపీ నేతల హవాపెరుగుతోంది. అయినప్పటికీ.. వైసీపీ నాయకులు, అధినాయకుడు కూడా మౌనంగానే ఉంటున్నారు.
ఇక, తాజా పరిణామాల విషయానికి వస్తే.. మద్యం దుకాణాల లాటరీలో కడపలో టీడీపీ దుమ్మురేపింది. టీడీపీ అనుకూల వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులు భారీ సంఖ్యలో దుకాణాలు దక్కించుకున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం సహా కమలాపురం నియోజకవర్గంలోనూ టీడీపీ అనుచరులే దుకాణాలు దక్కించుకున్నారు. మరికొందరు.. టీడీపీ సానుభూతి పరులు కూడా కడపలోపాగా వేశారు.
చిత్రం ఏంటంటే.. కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు కూడా కడపలో దుకాణాలు దక్కించుకున్నా రు. అయితే.. ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసుకున్న పోలీసులు ఏమైనా ఘర్షణలు జరుగుతాయేమోనని భావించి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, ఎక్కడా ఎలాంటి ఘర్షణా జరగకుండానే అంతా సాఫీగా సాగిపోయింది. సో.. దీనిని గమనిస్తున్నవారు.. సొంత జిల్లాలోనూ వైసీపీ చేతులు ఎత్తే సిందా? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
అంటే ఇక్కడ గొడవలు పెట్టుకోమని కాదు.. కనీసం.. పోటీ కూడా ఇవ్వలేకపోవడాన్నే వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కడపలో ఇటు రాజకీయంగా పెద్ద మార్పులు చోటు చేసుకుంటుంటే.. మరోవైపు.. వ్యాపార పరంగా కూడా వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇది భవిష్యత్తులో పార్టీ మనుగడ, ఆర్థిక అంశాలపై కూడా ఇబ్బందులు తప్పవన్న చర్చ ఉండడం గమనార్హం.